Begin typing your search above and press return to search.

దాయాది కాదు దద్దమ్మ.. సొంతగడ్డపై టెస్టు నెగ్గక వెయ్యి రోజులు

వన్డేలు తెరమరుగు అవుతున్నాయి కానీ.. టెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Sep 2024 11:30 PM GMT
దాయాది కాదు దద్దమ్మ.. సొంతగడ్డపై టెస్టు నెగ్గక వెయ్యి రోజులు
X

ఒకప్పుడు ఆ జట్టు పేస్ బౌలర్ల రివర్స్ స్వింగ్ అంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ హడలిపోయేవారు. వారి స్పిన్నర్ల మాయలో చిక్కి ఔటైపోయేవారు.. ఇక బ్యాటర్లు నిలకడగా ఆడేవారు.. ఓ పట్టాన వికెట్ ఇచ్చేవారే కాదు.. మంచి పేస్ బౌలింగ్ వేయగల ఆల్ రౌండర్లతో జట్టు సమతూకంగా ఉండేది. అయితే, గతమెంతో ఘనం అన్నట్టుగా తయారైంది ఆ జట్టు పరిస్థితి. మ్యాచ్ లో కనీసం వంద బంతులు ఆడలేరు.. ఐదు వికెట్లు తీయలేరు.. ఓవైపు మిగతా జట్లు పుంజుకొంటుంటే.. ఈ జట్టేమో రోజురోజుకూ వెనక్కుపోతోంది.

మూడున్నరేళ్లుగా గెలుపే లేదు

ఎన్ని కొత్త ఫార్మాట్లు వచ్చినా టెస్టు క్రికెట్ గొప్పదనం వేరు. వన్డేలు తెరమరుగు అవుతున్నాయి కానీ.. టెస్టులు మాత్రం కొనసాగుతున్నాయి. దీన్నిబట్టే ఈ ఫార్మాట్ ప్రత్యేకత చెప్పొచ్చు. కాగా, టెస్టుల్లో పాకిస్థాన్ ప్రస్తుతం 8వ ర్యాంకుకు పడిపోయింది. ఇటీవల సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడింది. స్వదేశంలో ఆ జట్టు ఇలా 10 వికెట్ల తేడాతో ఓడడం ఇదే తొలిసారి. మరోవైపు రెండో టెస్టులోనూ పరాజయం పాలై బంగ్లాకు తొలిసారి సిరీస్ అప్పగించింది. ఇదేముంది.. అసలు పాక్ స్వదేశం టెస్టు మ్యాచ్ గెలిచింది 2021 ఫిబ్రవరిలో. నాడు దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత మళ్లీ ఇప్పటికి.. అంటే మూడున్నరేళ్లుగా ఒక్క మ్యాచ్ లో కూడా నెగ్గలేదు.

10లో ఆరింట్లో ఓటమి..

2021 ఫిబ్రవరి నుంచి పాకిస్థాన్ తమ దేశంలో 10 టెస్టులు ఆడితే నాలుగు ఓడింది (తాజాగా బంగ్లాపైనే రెండు). మిగతా ఆరూ డ్రా అయ్యాయి. అసలు ఈ శతాబ్దంలో మరే జట్టుకూ ఇంత చెత్త రికార్డు లేదట. 1990ల్లో న్యూజిలాండ్‌ 10 టెస్టులకు పైగా గెలవలేదు. ఇక ఐసీసీ ర్యాంకుల్లో పాక్ 1965 తర్వాత ఘోరమైన ర్యాంకింగ్‌ కు పడిపోయింది. దీని తర్వాత ఉన్నవి అఫ్గానిస్థాన్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ మాత్రమే కావడం గమనార్హం.

ఎందుకీ దుస్థితి..?

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోనే కాదు.. ఆటగాళ్లలోనూ నిలకడ తక్కువే. బాబర్ అజామ్, మొహమ్మద్ రిజ్వాన్ వంటి వారు ఉండగా షాన్ మసూద్ వంటి సాధారణ ఆటగాడిని కెప్టెన్ చేశారు. షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా వంటి పేసర్లు ఉండగా.. వీరిద్దరినీ పక్కనపెట్టి బంగ్లాదేశ్ పై రెండో టెస్టు ఆడారు. అసలు ఉప ఖండంలో ఆడుతూ ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తీసుకోకపోవడం ఏమిటో ఎవరికీ తెలియనది. బంగ్లాదేశ్ పై తొలి టెస్టులో 460 పరుగులు చేసి.. అప్పటికీ రిజ్వాన్ 170 పైగా పరుగులతో ఆడుతుండగా డిక్లేర్ చేయడం ఇంకా విడ్డూరం. మరోవైపు పాక్ క్రికెట్ బోర్డు అంటేనే ఆశ్రిత పక్షపాతానికి మారు పేరుగా మారింది. కోచింగ్‌ సిబ్బంది, సెలక్టర్లు తరచూ మారిపోతుంటారు. ఇప్పుడు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ కిర్ స్టెన్ ను తీసుకొచ్చారు. దీనికిముందు మూడేళ్లలో సక్లెయిన్‌ ముస్తాక్‌, అబ్దుల్‌ రహ్మాన్‌, గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌, మహమ్మద్‌ హఫీజ్‌, అజర్‌ మహమ్మద్‌, జాసన్‌ గిలెస్పీ కోచ్ లుగా ఉన్నారు. పాక్ రాజకీయాలూ ఆ జట్టును దెబ్బకొడుతున్నాయి. ఏమాత్రం ఫిట్ గా కనిపించని మాజీ కీపర్మోయిన్‌ ఖాన్‌ కుమారుడు అజం ఖాన్‌ టి20 ప్రపంచ కప్ ఆడడం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

ఆటగాళ్లు సిక్సర్లు కొట్టాలని మిలటరీ శిక్షణ ఇవ్వడం ఏమిటో..? జట్టులో మంచి సీమర్లు ఉన్నారని.. స్పిన్నర్ ఒక్కరూ లేకుండా టెస్టు ఆడడం ఏమిటో? ఇవన్నీ పాక్ క్రికెట్ లో జరిగినవే. దీన్నిబట్టి పాక్ క్రికెట్ లో ఆధునిక ప్రమాణాలు ఉండవని.. ఫిట్‌ నెస్‌, స్పెషలైజేషన్‌, డేటాతో ముందుకెళ్లడం కనిపించవు. స్పోర్ట్స్‌ సైన్స్‌, అనలిటిక్స్‌ వంటివి ఏమీ తెలియదని స్పష్టం అవుతోంది.