Begin typing your search above and press return to search.

ఏంటా దూకుడు..? ప్రపంచ కప్ ఆ జట్టుదేనా..? బ్యాడ్ లక్ వెంటాడకుంటే?

వాస్తవానికి డిఫెండింగ్ చాంపియన ఇంగ్లండ్ ను ఈ టోర్నీలో అందరూ హాట్ ఫేవరెట్ గా పరిగణించారు. ఆ జట్టు 500 పరుగులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 6:40 AM GMT
ఏంటా దూకుడు..? ప్రపంచ కప్ ఆ జట్టుదేనా..? బ్యాడ్ లక్ వెంటాడకుంటే?
X

భీకర ఫామ్ లో బ్యాటర్లు.. దుమ్ముదులుపుతున్న ఆల్ రౌండర్.. మంచి పదును మీద పేసర్లు.. ఇదంతా చూస్తుంటే వన్డే ప్రపంచ కప్ ఆ జట్టుదేనా? అనే అభిప్రాయం కలుగుతోంది. అసలు ఆ జట్టును ఆపగలమా? అని అనిపిస్తోంది.. ముందు బ్యాటింగ్ కు దిగితే 300 కు తక్కువ కొట్టడమే లేదు.. 350 పరుగులు అలవోకగా చేసేస్తున్నారు.. 400 కూడా బాదేస్తున్నారు. గతంలో వారిని వెంటాడిన ఒత్తిడి అనేది కనిపించడం లేదు. ఇప్పటివరకు అయితే, టీమిండియా కంటే ఆ జట్టే ప్రపంచ కప్ ఫేవరెట్ అని చెప్పకతప్పదు.

ఒత్తిడి లేదు.. ఎదురుదాడే

ఐసీసీ టోర్నీలంటే ఒత్తిడికి గురికావడం దక్షిణాఫ్రికా లక్షణం. ఏమాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆ జట్టు చేతులెత్తేసేది. దీనికితోడు బ్యాడ్ లక్ ను భుజాన మోసుకుంటూ వచ్చేది. కానీ, ఈసారి ప్రపంచ కప్ లో అదేమీ లేదు. దూకుడే మంత్రంగా చెలరేగిపోతోంది. వాస్తవానికి డిఫెండింగ్ చాంపియన ఇంగ్లండ్ ను ఈ టోర్నీలో అందరూ హాట్ ఫేవరెట్ గా పరిగణించారు. ఆ జట్టు 500 పరుగులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనుకున్నారు. కానీ, దక్షిణాఫ్రికా మీద ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. అయితే అంతా తలకిందులైంది. కప్ ఆరంభమైనప్పటి నుంచి పరుగుల వరద పారిస్తున్నది దక్షిణాఫ్రికా. బుధవారం నాటి మ్యాచ్ లోనూ 357 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన ఆ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి చేసింది 61 పరుగులే. సెంచరీ వీరులు

డికాక్‌, వాండర్‌ డసెన్‌ కూడా ధాటిగా ఆడలేకపోయారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. డికాక్‌.. 40వ ఓవర్లో ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 238. ఇక ఆఖర్లో దక్షిణాఫ్రికా బాదుడు టాప్ లోకి వెళ్లింది.. మిల్లర్‌, వాండర్‌డసెన్‌ విరుచుకుపడడంతో చివరి ఏడు ఓవర్లలో 99 పరుగులు పిండుకుంది. మిల్లర్‌ 29 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

అన్ని రంగాల్లోనూ పటిష్ఠం

బ్యాటింగ్ లో డికాక్, డసెస్, మార్క్ రమ్, క్లాసెన్, మిల్లర్ విధ్వంసకరంగా ఆడుతున్నారు. ఆల్ రౌండర్ జాన్సన్ బంతితో, బ్యాటుతో రాణిస్తున్నాడు. స్పిన్నర్ మహరాజ్ ఎలాగూ పెద్ద బలమే. మిగిలింది పేసర్లు రబాడ, ఎంగిడి. వీరిద్దరూ మంచి పేసర్లు అనే సంగతి అందరికీ తెలిసిందే. మూడో పేసర్ కొయెట్జీ కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇలా అన్ని రంగాల్లోనూ దక్షిణాఫ్రికా బలంగా ఉంది.

తెలివిగానూ ఆడుతోంది..

టోర్నీలో దక్షిణాఫ్రికా తెలివిగానూ ఆడుతోంది. ప్రధాన పేసర్లు రబడ, ఎంగిడిలపై భారం పడకుండా.. జాన్సన్ ను ఓపెనింగ్ బౌలర్ గా దింపుతోంది. కొయెట్జీ సేవలనూ తగిన రీతిలో వాడుకుంటోంది. వాస్తవానికి టోర్నీకి ముందే నోకియా వంటి పేసర్ గాయపడడంతో దక్షిణాఫ్రికా పనైపోయింది అనుకున్నారు. కానీ, 6.7 అడుగుల జాన్సన్ కు కొత్త బంతిని అప్పగించి.. తగిన ఫలితం పొందుతోంది.

ఛేదనలోనే తడబాటు

దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచింది. దాని రన్ రేట్ కూడా ప్లస్ 2 పైనే ఉంది. ఒక్క మ్యాచ్ (నెదర్లాండ్స్)లో మాత్రమే ఓడింది. పాకిస్థాన్ పై 270 పరుగుల లక్ష్యాన్ని కనాకష్టంగా ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. ఈ రెండు మ్యాచ్ లలో ఛేజింగ్ కు దిగి గెలుపు కోసం కష్టపడింది. దీన్నిబట్టి చెప్పేదేమంటే.. దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని మోస్తరు స్కోరు చేసినా చాలు. అదే బౌలింగ్ ఎంచుకుంటే మాత్రం సఫారీలు చెలరేగిపోతున్నారు. ఈ సమీకరణాన్ని పరిగణనలోకి తీసుకుని మున్ముందు దక్షిణాఫ్రికా ప్రత్యర్థులు అడుగులు వేస్తే విజయం సాధించవచ్చు.