Begin typing your search above and press return to search.

15 ఏళ్లకే టీమ్ ఇండియాలోకి వచ్చేలా ఉన్నాడు.. అంత టాలెంటెడ్ అతడు

ఇప్పుడు నాలుగు రోజుల మ్యాచ్ లో భారత యువ జట్టుతో చెన్నైలో తలపడుతోంది.

By:  Tupaki Desk   |   3 Oct 2024 1:30 AM GMT
15 ఏళ్లకే టీమ్ ఇండియాలోకి వచ్చేలా ఉన్నాడు.. అంత టాలెంటెడ్ అతడు
X

అతడి వయసు 12-13 ఏళ్లే.. కానీ ఇప్పటికే రంజీ ట్రోఫీ ఆడేశాడు.. అంటే భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ల కంటే చిన్న వయసులోనే దేశవాళీల్లో అత్యుత్తమమైన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడు 13 ఏళ్లకే అండర్ 19 జాతీయ జట్టుకు ఆడుతూ సెంచరీ కొట్టాడు.. అదికూడా అతి తక్కువ బంతుల్లో కొట్టి రికార్డు నెలకొల్పాడు.. భారత క్రికెట్ లో చరిత్రలో నిలిచిపోయేలా ఉన్నాడు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్న ఆ కుర్రాడు ఎవరు?

యూత్‌ టెస్టులో దుమ్మురేపి..

ప్రస్తుతం ఆస్ట్రేలియా అండర్ 19 జట్టు భారత్ లో పర్యటిస్తోంది. మొన్నటివరకు టి20లు ఆడింది. ఇప్పుడు నాలుగు రోజుల మ్యాచ్ లో భారత యువ జట్టుతో చెన్నైలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టాడో కుర్రాడు.. అయితే అతడు కుర్రాడు కాదు పిల్లాడు అని చెప్పాలి. ఎందుకంటే.. తన వయసు చాలా తక్కువ కాబట్టి. అతడి పేరు వైభవ్‌ సూర్యవంశీ. కాగా, ఈ మ్యాచ్ లో సూర్యవంశీ 58 బంతుల్లో సెంచరీ కొట్టాడు. భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన యూత్‌ టెస్టు సెంచరీ ఇదే కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే రెండో ఆటగాడు. సూర్యవంశీ వయసు 13 ఏళ్లే. తాజా ప్రదర్శనతో తన ఆట గురించి అందరూ చర్చించుకునేలా చేశాడు.

సూర్యవంశీ బిహార్‌కు చెందినవాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 62 బంతుల్లో 14×4, 4×6లతో 104 పరుగులు చేశాడు. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయిన రంజీల్లో ఆడడంతో సూర్యవంశీ అందరి దృష్టిలోపడ్డాడు. బిహార్ లోని సమస్తిపుర్‌ జిల్లాకు చెందిన సూర్యవంశీ తండ్రి సంజీవ్ క్రికెట్ కు వీరాభిమాని. దీంతో సూర్యవంశీకి బాల్యం నుంచే క్రికెట్ వాతావరణం అలవాటైంది. ఇలా మొదలైన అతడి ప్రస్థాన 12 ఏళ్ల 284 రోజుల వయసుకే బిహార్‌ తరఫున రంజీలు ఆడే అవకాశం తెచ్చింది.

ఆ ఇద్దరి కంటే..

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ కంటే చిన్న వయసులోనే రంజీల్లో అరంగేట్రం చేసిన రికార్డును అందుకున్న సూర్యవంశీ. కాగా, సూర్యవంశీ ఎడమచేతివాటం బ్యాట్స్ మన్. అందుకే వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మన్ బ్రియాన్‌ లారాను స్ఫూర్తిగా తీసుకున్నాడు. లారాలాగే బౌలర్లపై దాడికి దిగుతాడు సూర్యవంశీ. ఏజ్‌ గ్రూప్‌ టోర్నీ అయిన వినూ మన్కడ్‌ ట్రోఫీలో సూర్యవంశీ సెంచరీ కొట్టేశాడు. మూడు అర్ధ సెంచరీలూ సాధించాడు. దీంతో అందరి దృష్టిలో పడ్డాడు. కాగా, గత ఏడాది సూర్యవంశీ ఇండియా ‘బి’ తరఫున నాలుగు దేశాల టోర్నీలోనూ రాణించాడు.

జాతీయ క్రికెట్ అకాడమీలో తర్ఫీదు

ప్రతిభావంతులైన కుర్రాళ్లను సానబెట్టేందుకు ఏర్పాటు చేసిన జాతీయ క్రికెట్ అకాడమీ.. సూర్యవంశీపై నజర్ పెట్టింది. దీని తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఆస్ట్రేలియన్‌ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ అన్ని రకాల షాట్లు కొట్టాడు. 14 ఫోర్లు, 4 సిక్స్‌ లతో చెలరేగాడు. వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన మొయిన్‌ అలీ 2005లో కేవలం 56 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు.