Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలాన్ని ఈసారి నిర్వహించే మల్లికా సాగర్ ఎవరు?

అంటే.. మల్లికా సాగర్ అడ్వానీ అని చెబుతున్నారు. మరి.. ఈమె ఎవరు? ఆమెకే ఆ అవకాశం ఎందుకు దక్కింది? లాంటి ప్రశ్నలు వెంటనే మనసులోకి వచ్చేస్తాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2023 9:09 AM GMT
ఐపీఎల్ వేలాన్ని ఈసారి నిర్వహించే మల్లికా సాగర్ ఎవరు?
X

కాసులు కురిపించే ఐపీఎల్ 2024 వేలానికి వేళాయే. మరో రోజులో (మంగళవారం) దుబాయ్ వేదికగా వేలం జరగనుంది. దీనిపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. ఐపీఎల్ జట్లలో ఇప్పుడున్న ఖాళీలు 77 మాత్రమే. కానీ.. వీటి కోసం పోటీ పడుతున్న ఆటగాళ్లు ఏకంగా 12 దేశాల నుంచి 333 మంది క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ వేలం వేళ.. వేలాన్ని నిర్వహించే బాధ్యతను ఈసారి ఒక మహిళ చేతికి అప్పజెప్పారు. ఇప్పుడు ఆమె గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఐపీఎల్ లాంటి అత్యంత ఖరీదైన టోర్నీకి సంబంధించిన కీలక వేలంపాటను నిర్వహించే అవకాశం దక్కటం మాటలు కాదు. దాని వెనుక ఎంతో కసరత్తు జరిగితే కానీ.. ఆ అవకాశం దక్కదు. ఇంతకీ ఈసారి ఆ అవకాశం దక్కించుకున్న మహిళ ఎవరు? అంటే.. మల్లికా సాగర్ అడ్వానీ అని చెబుతున్నారు. మరి.. ఈమె ఎవరు? ఆమెకే ఆ అవకాశం ఎందుకు దక్కింది? లాంటి ప్రశ్నలు వెంటనే మనసులోకి వచ్చేస్తాయి.

మల్లికకు సంబంధించిన సమాచారం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఇక.. ఆమె విషయానికి వస్తే.. 48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబయికి చెందిన వారు. ఆమె ఒక ఆర్ట్ కలెక్టర్. మెడ్రన్ అండ్ కాన్ టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబయికు చెందిన సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు. ఆక్షన్లను నిర్వహించటంలో ఆమెకు చక్కటి అనుభవం ఉంది. గడిచిన ఇరవై ఏళ్లలో బోలెడన్ని వేలం నిర్వాహకురాలిగా వ్యవహరించారు.

క్రిస్టీస్ ఆక్షన్ హౌస్ లో వేలం నిర్వహించిన అనుభవం ఆమెకు సొంతం. అంతేకాదు.. క్రిస్టీస్ లో వేలం నిర్వహించిన తొలి భారత సంతతికి చెందిన మహిళా ఆక్షనీర్ గా ఆమెకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్రీడా వేలంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 2021 ప్రొ కబడ్డీ లీగ్ వేలంలో తన వాక్ చాతుర్యంతో మల్లికా అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాదు.. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలాన్ని ఆమే నిర్వహించారు. డిసెంబరు 8న జరిగిన డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ వేలంలోనూ మల్లికా చేతుల మీదనే జరిగింది. దీంతో.. గడిచిన కొన్ని ఐపీఎల్ వేలంలో ఆక్షనిర్ గా వ్యవహరించిన హ్యు ఎడ్మీడ్స్ స్థానాన్ని మల్లికా భర్తీ చేయనుంది. ఆమె.. ఈ వేలాన్ని ఎంత బాగా చేస్తారన్నది మరో రోజులో తేలనుంది.