Begin typing your search above and press return to search.

హఠాత్తుగా జట్టును వీడిన టీమిండియా స్టార్.. కారణం ఏమంటే?

కానీ, ఇంతలో భారత స్టార్ బ్యాటర్ అకస్మాత్తుగా టీమ్ ను వీడాడు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో అభిమానులు కంగారు పడ్డారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 9:16 AM GMT
హఠాత్తుగా జట్టును వీడిన టీమిండియా స్టార్.. కారణం ఏమంటే?
X

మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది. అన్ని జట్లూ బలగాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక బరిలో దిగడమే మిగిలింది. కానీ, ఇంతలో భారత స్టార్ బ్యాటర్ అకస్మాత్తుగా టీమ్ ను వీడాడు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో అభిమానులు కంగారు పడ్డారు.

గువహటి నుంచి తిరువనంతపురానికి..

ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా ఇంగ్లండ్ తో అసోంలోని గువాహటిలో సన్నాహక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ వర్షం వల్ల ఇది రద్దయింది. రెండో సన్నాహక మ్యాచ్ తిరువనంతపురంలో మంగళవారం ఉంది. కానీ, దీనికి ముందే స్టార్ బ్యాటర్ తిరువనంతపురం రాకుండా ముంబై వెళ్లాడు. ఇది కూడా హఠాత్తుగా జరగడంతో కాస్త చర్చనీయాంశమైంది.

బోర్డుకు చెప్పి.. ముంబైకి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వీరి వివాహం జరగ్గా.. 2021 జనవరిలో కుమార్తె వామిక జన్మించింది. కాగా, అనుష్క రెండోసారి తల్లి కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో కోహ్లి ముంబై వెళ్లాడు. అంతేగాక.. ఇటీవల వీరిద్దరూ ముంబయిలోని ఓ గైనకాలజీ ఆసపత్రి వద్ద కన్పించారు. ఈ నేపథ్యంలో కోహ్లీ జట్టు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకుని ముంబై వెళ్లాడు. వ్యక్తిగత అత్యవసర కారణాలతో అతడు జట్టును వీడినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, కోహ్లీ ఒక్క రోజు వ్యవధిలో తిరిగి జట్టుతో చేరాడని సమాచారం.

అప్పుడు సెలవు పెట్టి..

కోహ్లి-అనుష్క దంపతులు 2021 జనవరిలో తొలిసారి తల్లిదండ్రులయ్యారు. నాడు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. తొలి టెస్టుకు సారథ్యం వహించిన అనంతరం కోహ్లి భారత్ కు తిరిగి వచ్చాడు. తొలి కాన్పు సమయంలో అనుష్క చెంతనే ఉన్నాడు. కాగా, ఈసారి ప్రపంచ కప్ ముంగిట అనుష్క రెండోసారి తల్లి కాబోతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. అయితే, ఆమె ఎన్ని నెలల గర్భంతో ఉన్నదో తెలియడం లేదు. త్వరలోనే ఆ సమాచారం బయటకు వచ్చే వీలుంది.