డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్ర తెలుసా?
ఈ నేపథ్యంలో తొలిరోజు 10 ఫ్రాంఛైజీలు కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
By: Tupaki Desk | 25 Nov 2024 3:46 AM GMTఐపీఎల్ సందడి మొదలైంది. మెగా వేలం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఆదివారం మొదలైన ఈ వేలం ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఈ నేపథ్యంలో తొలిరోజు 10 ఫ్రాంఛైజీలు కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. దీనికోసం రూ.467 కోట్లు ఖర్చు చేశాయి.
ఇందులో.. తొలిరోజు మొత్త మీద పంత్ - రూ.27 కోట్లతో అత్యధిక ధర పలికి రికార్డ్ సృష్టించాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో బట్లర్ - రూ.15.75 కోట్ల ధర పలకగా.. ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ అరంగేట్రం చేయని క్రికెటర్ల జాబితాలో రసీఖ్ సలాం - రూ.6 కోట్లతో అత్యధిక ధర పలికారు. అయితే 72 మందిలో వార్నర్ లేకపోవడం గమనార్హం.
అవును... ఐపీఎల్ లో ఆల్ టైం ఫెవరెట్.. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన డేవిడ్ వార్నర్ ను తొలి రోజు వేలంలో ఏ జట్టూ కొనుక్కోలేదు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. డేవిడ్ వార్నర్ కి ఈ పరిస్థితి ఏమిటి అంటూ ఆన్ లైన్ వేదికగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా... వార్నర్ ఐపీఎల్ కెరీర్ మరోసారి చర్చకొచ్చింది.
సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24 ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్ ను ఏ జట్టూ దక్కించుకోకపోవడం ఆసక్తిగా మారింది. టీ20 చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ ఘనత సాధించాడు. మూడూ సీజన్స్ (2015, 17, 19) లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
38 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇందులో భాగంగా... 184 మ్యాచ్ లు ఆడిన వార్నర్ 40.52 సగటుతో 6,565 పరుగులు చేశాడు. 139.77 స్త్రైక్ రేట్ తో నాలుగు సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు సాధించాడు.
వీటిలో 663 ఫోర్లు, 236 సిక్స్ లు ఉండగా.. 83 క్యాచ్ లు కూడా అందుకున్నాడు. 2019లో అత్యుత్తమ సగటు నెలకొల్పాడు. ఆ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడి 69.20 సగటుతో, 143.86 స్ట్రైక్ రేట్ తో 692 పరుగులు చేశాడు. వీటిలో 1 సెంచరీ 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లోనే 57 ఫోర్లు 21 సిక్స్ లు బాదేశాడు.
కాగా... గత ఏడాది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ అతని చివరి వన్డే కాగా.. పాకిస్థాన్ తో జరిగిన సిరీస్ టెస్టుల్లో చివరిది. ఈ సిరీస్ అనంతరం వార్నర్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక చివరి టీ20 మ్యాచ్ యూఎస్ – వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ లోనిది!