Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియాలో వీర 'గంభీరం'.. ఆ స్టార్లు ఇక ఇంటికే?

9 టెస్టులు.. 5 పరాజయాలు.. వీటిలో సొంతగడ్డపైనే మూడు.. అది కూడా క్లీన్ స్వీప్.

By:  Tupaki Desk   |   1 Dec 2024 10:30 PM GMT
టీమ్ ఇండియాలో వీర గంభీరం.. ఆ స్టార్లు ఇక ఇంటికే?
X

ఆరు నెలలు హనీమూన్ ముగిసింది.. జట్టు వైఫల్యాలు రెట్టింపయ్యాయి.. ఇంకా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ బాగా పడిపోయింది.. ఇది ఇలాగే కొనసాగితే తన స్థానానికే ముప్పు వస్తుందని స్పష్టమైంది.. దీంతో ఇక కొరడా ఝళిపించడం తప్పడం లేదు.. ఇదీ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరిస్థితి.

9 టెస్టులు.. 5 పరాజయాలు.. వీటిలో సొంతగడ్డపైనే మూడు.. అది కూడా క్లీన్ స్వీప్. ఇదీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చాక టీమ్ ఇండియా ప్రదర్శన. దీంతోనే అతడు స్టార్ ఆటగాళ్లపై తీవ్రంగా సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది.

హెచ్చరిక వారికే..

టీమ్ ఇండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట కోహ్లి పూర్తిగా ఫామ్ కోల్పోయారు. రోహిత్ అసలు టెస్టులకు పనికిరానట్లు అయిపోయాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 2-1తో వెనుకబడింది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు లేవు. బాక్సింగ్ డే (మెల్ బోర్న్) టెస్టులో డ్రా చేసుకునే చాన్స్ ఉండి కూడా ఓడిపోయింది. దీంతో డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం పూర్తిగా మారిపోయిందట.

గంభీర్ మార్క్ ఎక్కడ..?

హెడ్ కోచ్ గా తన ముద్ర కనిపించకపోయేసరికి గౌతమ్ గంభీర్ తీవ్ర ఒత్తిడిలో పడ్డాడు. మెల్ బోర్న్ టెస్టు తర్వాత ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడట. వీరిలో స్టార్‌ ప్లేయర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ చేజారాక డ్రెస్సింగ్‌ రూమ్‌ కు వచ్చిన ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడట.

ఇక చాలించండి..

పేలవ షాట్లు కొట్టి వికెట్లు కోల్పోయిన కొందరు స్టార్ ఆటగాళ్లను ఉద్దేశించి.. ‘ఇక చాలు’ అన్నట్లు సమాచారం. కాగా, తమదైన శైలిలోనే ఆడేందుకు ఆటగాళ్లకు గంభీర్ ఆరు నెలలు స్వేచ్ఛ ఇచ్చాడట. సరిగ్గా ఆ సమయం ముగియడంతో తన స్టయిల్ లో వెళ్లాలని భావిస్తున్నాడట. తన, జట్టు వ్యూహాలకు తగ్గట్లు ఆడనివారిపై వేటుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశాడని సమాచారం.

ఎవరా సీనియర్లు?

బాక్సింగ్ డే టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లోనూ కొట్టిన షాట్లు విమర్శలకు తావిచ్చాయి. మ్యాచ్ లో ఓటమికి అవే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. మొదటి నుంచి ఉన్న తన బలహీతను చాటుతూ కోహ్లి అయితే ఐదో వికెట్ మీద పడిన బంతి ఆడి ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ కెప్టెన్ గానే కాదు ఆటగాడిగా పనికొస్తాడా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే గంభీర్ త్వరలోనే తీవ్రమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం.

పుజారా కావాలన్న గంభీర్..

వికెట్ల ముందు వాల్ గా పేరు తెచ్చుకున్న చతేశ్వర్ పుజారా సేవలను తాను వాడుకుంటానని గంభీర్ బీసీసీఐని కోరాడట. కానీ, దీనికి బోర్డు ఒప్పుకోలేదని సమాచారం. అనుభవంతో జట్టులో స్థిరత్వాన్ని తెస్తాడని.. అతడిని జట్టులోకి తీసుకోవాలని పెర్త్‌ టెస్టు అనంతరమే కోరాడట. కానీ, ఒప్పుకోలేదని సమాచారం.