13 సార్లు తలకు తగిలిన బంతి.. 26 ఏళ్లకే ‘తిక్క’ క్రికెటర్ రిటైర్మెంట్
ఆస్ట్రేలియా కుడి చేతివాటం బ్యాట్స్ మన్ విల్ పకోవ్ స్కీ.. ఇతడి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది.
By: Tupaki Desk | 30 Aug 2024 5:47 AM GMTపదేళ్ల కిందట ఓ పేసర్ వేసిన బంతి ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫిల్ హ్యూజ్ మెడ వెనుక వైపున బలంగా తగిలడం.. అతడు మైదానంలో కుప్పకూలడం.. హెలికాప్టర్ లో ఆస్పత్రికి తరిలించడం.. ఆ తర్వాత చనిపోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్ లో కంకషన్ రూల్ తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సహా పలువురు క్రికెటర్లు కంకషన్ కు గురయ్యారు. ఇలాంటి సందర్భంలో ఆ క్రికెటర్ కు బదులుగా సమాన స్థాయి (ఆల్ రౌండర్ అయితే ఆల్ రౌండర్, బౌలర్ అయితే బౌలర్, బ్యాటర్ అయితే బ్యాటర్) ఆటగాడు మైదానంలో దిగేందుకు అనుమతిస్తారు. ఒక్కసారి బంతి తలకు తగిలితేనే అలాంటి పరిస్థితి ఉంటే.. ఓ క్రికెటర్ ఏకంగా 13 సార్లు కంకషన్ కు గురయ్యాడు.
ఇతడికి కాస్త తిక్క ఎక్కువే..
ఆస్ట్రేలియా కుడి చేతివాటం బ్యాట్స్ మన్ విల్ పకోవ్ స్కీ.. ఇతడి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు.. భవిష్యత్ ఆస్ట్రేలియా మేటి బ్యాట్స్ మన్ అవుతాడనే అంచనాలు.. కానీ, తరచూ తనకు మెంటల్ హెల్త్ బాగోలేదంటూ తప్పుకొనేవాడు. అది దేశవాళీ క్రికెట్ లో అయినా.. జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంలో అయినా పకోవ్ స్కీ అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకునేవాడు. తలకు బంతి తగిలించుకోవడం.. లేదంటే మెంటల్ హెల్త్ ను కారణంగా చూపడం.. అదీ కాదంటే గాయాలు.. ఇదీ పకోవ్ స్కీ బ్యాడ్ లక్. తాజాగా అతడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పకోవ్ స్కీ వయసు కేవలం 26 మాత్రమే.
బౌన్సర్లు అతడి పాలిట విలన్లు
పకోవ్ స్కీ.. టాప్ ఆర్డర్ బ్యాటర్. అంటే టెక్నికల్ గా సౌండ్ అనే అనుకోవాలి. కానీ, అతడు పదేపదే కంకషన్ కు గురయ్యేవాడు. వాస్తవానికి పకోవ్ స్కీని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు రీప్లేస్ మెంట్ గా భావించేవారు. అయితే, ఇప్పటికే 13 సార్లు కంకషన్ అయిన అతడు డాక్టర్ల సూచనతో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. కేవలం 26 ఏళ్ల వయసులో.. కెరీర్ ఇంకా పూర్తిగా మొదలు కాకుండానే పకోవ్ స్కీ గుడ్ బై చెప్పాడు.
ఆడింది ఒకటే టెస్టు.. అదీ భారత్ పైనే
పకోవ్ స్కీ కెరీర్ లో ఆడింది ఒకటే ఒక అంతర్జాతీయ మ్యాచ్. అది కూడా భారత్ పైనే కావడం గమనార్హం. 2021లో సిడ్నీలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన పకోవ్ స్కీ.. ఇదే మ్యాచ్ లో భుజం గాయానికి గురయ్యాడు. తర్వాత ఆరు నెలలు మైదానంలోకి దిగలేదు. చివరగా అతను మార్చిలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతూ పకోవ్ స్కీ కంకషన్ కు గురవడం గమనార్హం. బంతి హెల్మెట్ కు బలంగా తాకడంతో మళ్లీ ఆడలేదు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు లీసెస్టర్ షైర్ ఒప్పందాన్నీ రద్దు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు విక్టోరియా తరపున షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో రెండు డబుల్ సెంచరీలు చేసి భారత్ తో సిరీస్ కు ఎంపికైన పకోవ్ స్కీ.. ఆస్ట్రేలియా- ఎ తరపున ఆడుతూ కంకషన్ అయ్యాడు. కాగా, 2017లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన ఇతడు 36 మ్యాచ్ లలో 45.19 సగటుతో 2,350 పరుగులు చేశాడు. ఏడు సెంచరీలు చేశాడు. 4 లిస్ట్- ఎ మ్యాచ్ లలో 333 పరుగులు సాధించాడు.