Begin typing your search above and press return to search.

ఆసీస్ కెప్టెన్ 3వ ఐపీఎల్ కప్ అందిస్తాడా? వర్షంతో ఫైనల్ రద్దయితే?

దీంతో వార్నర్ సన్ రైజర్స్ ను విజయ పథంలో నడిపి తన సత్తా చాటాడు.

By:  Tupaki Desk   |   25 May 2024 1:59 PM GMT
ఆసీస్ కెప్టెన్ 3వ ఐపీఎల్ కప్ అందిస్తాడా? వర్షంతో ఫైనల్ రద్దయితే?
X

ఎప్పుడో 2009లో.. అసలు అంచనాలే లేకుండా బరిలో దిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ కొట్టింది దక్కన్ చార్జర్స్. అప్పట్లో కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్. ఆస్ట్రేలియా తరఫునే కాదు ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన గిల్ క్రిస్ట్ ఆస్ట్రేలియాకు పూర్తి స్థాయి కెప్టెన్ కాలేకపోయాడు. ఆ లోటును దక్కన్ చార్జర్స్ నాయకత్వంతో భర్తీ చేసుకున్నాడు. ఇక దక్కన్ చార్జర్స్ రద్దయి.. దాని స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. 2016లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అద్భుత సామర్థ్యంతో ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఇక్కడ వార్నర్ కూడా ఆస్ట్రేలియా కెప్టెన్సీ అందుకోతగిన సామర్థ్యం ఉన్నవాడే. కానీ, స్టీవ్ స్మిత్ ఆ చాన్స్ కొట్టేశాడు. దీంతో వార్నర్ సన్ రైజర్స్ ను విజయ పథంలో నడిపి తన సత్తా చాటాడు. మళ్లీ ఇప్పుడు సన్ రైజర్స్ ఐపీఎల్ ఫైనల్ చేరింది.

అప్పుడు ప్రపంచ కప్.. ఇప్పుడు ఐపీఎల్?

ఆస్ట్రేలియాకు గిల్ క్రిస్ట్, వార్నర్ మాదిరి కాకుండా పూర్తి స్థాయి కెప్టెన్ గా ఎంపికైన పేసర్ ప్యాట్ కమ్మిన్స్ ఇప్పటికే వన్డే ప్రపంచ కప్ అందించాడు. గత ఏడాది భారత్ లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించిన సంగతి తెలిసిందే. మంచి బౌలింగ్ తో కట్టిపడేసిన కమ్మిన్స్.. కీలక వికెట్లు తీసి వారి జట్టు విజయంలో భాగమయ్యాడు. అలా మన మననును తియ్యని దెబ్బకొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ సన్ రైజర్స్ ను ఫైనల్ చేర్చాడు. ఈ టైటిల్ కూడా కొడితే 7 నెలల వ్యవధిలో భారత్ వేదికగా రెండో పెద్ద టైటిల్ సాధించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోతాడు.

వర్షం పడి ఫైనల్ రద్దయితే..?

ఐపీఎల్-17 ఫైనల్ ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగి రద్దయితే? ఏమిటి పరిస్థితి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే జరిగితే సోమవారం ఫైనల్ ను నిర్వహిస్తారు. అయితే, ఆ రోజు కూడా వర్షం పడి రద్దయితే పాయొంట్ల పట్టికలో టాప్ లో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన కోల్ కతా నైట్ రైడర్స్ కు టైటిల్ దక్కుతుంది. కాగా, ఆదివారం చెన్నైలో వర్షం కురిసే అవకాశం 3 శాతమేనని వాతావరణ శాఖ తెలిపింది.

కొసమెరుపు: 2018 నుంచి ఐపీఎల్ టైటిల్ విజేతల క్రమాన్ని పరిశీలిస్తే తొలి క్వాలిఫయర్ గెలిచిన జట్టే టైటిల్ సాధిస్తోంది. ఈ సంప్రదాయ ప్రకారం చూస్తే కోల్ కతా వైపే మొగ్గు కనిపిస్తోంది. మైదానంలో ఏం జరుగుతుందో చూద్దాం..?