టీమిండియా అమ్మాయిలు అదరహో.. రికార్డుల రికార్డు
ఇటీవల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన భారత మహిళల జట్టు ఏకైక టెస్టులో మాత్రం ప్రత్యర్థిని కుప్పకూల్చింది.
By: Tupaki Desk | 16 Dec 2023 3:30 PM GMTటి20ల్లో పర్వాలేదు.. వన్డేల్లో మోస్తరు.. కానీ టెస్టుల్లో మాత్రం పసికూనే.. స్వదేశంలో చెలరేగుతారు.. విదేశాల్లో తేలిపోతారు.. బ్యాటర్లలో ఒకరిద్దరు మాత్రమే రాణిస్తారు.. మిగతావారంతా ఇలా వచ్చి అలా వెళ్తారు.. పేస్ బౌలర్లు పేరుకే అన్నట్లు ఉంటారు.. స్పిన్నర్లు సుడి తిరిగితేనే వికెట్లు తీస్తారు.. ఒత్తిడి ఎదురైతే అసలు ఆడలేరు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి వాటితో అయితే ముందే ఓటమిని ఒప్పుకొంటారు.. ఇదీ టీమిండియా మహిళల క్రికెట్ జట్టు గురించి నిన్నటివరకు ఉన్న అభిప్రాయం.. ఇక మీదట మాత్రం ఇలా ఎవరూ అనరేమో? టెస్టుల్లో అంతటి గొప్ప విజయం సాధించింది మన అమ్మాయిల జట్టు.
అబ్బాయిలకూ సాధ్యం కాదేమో..?
ఇటీవల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైన భారత మహిళల జట్టు ఏకైక టెస్టులో మాత్రం ప్రత్యర్థిని కుప్పకూల్చింది. ఒక్క రోజులోనే 410 పరుగులు.. ఒక్క సెషన్ లోనే 10 వికెట్లు.. మూడు రోజే మ్యాచ్ కు ముగింపు.. ఇన్నింగ్స్ విజయం.. అది కూడా మహిళా క్రికెట్ చరిత్రలో రికార్డు ఆధిక్యం.. బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సూపర్ స్టార్లున్న పురుషుల జట్టుకూ సాధ్యం కాని గొప్ప విజయాన్ని సాధించింది అమ్మాయిల జట్టు. ఇంత అద్భుతాన్ని సాధించిన మహిళల జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
నవీ ముంబయి వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 428 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 136 పరుగులకే కుప్పకూల్చింది. రెండో ఇన్నింగ్స్ లో 186/6 (డిక్లేర్డ్ )నూ మంచి స్కోరు చేసింది. ఇంగ్లండ్ కు 479 పరుగుల లక్ష్యం విధించింది. ఛేదనలో ఇంగ్లాండ్ ను 131 పరుగులకే పడగొట్టింది. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత భారీ ఆధిక్యం 347 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. శ్రీలంకపై 1998లో పాకిస్థాన్ 309 పరుగుల తేడాతో గెలిచింది. అంతేకాదు.. టెస్టుల్లో ఇంగ్లాండ్ ను ఓడించడం భారత జట్టుకు ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకే సెషన్ లో ప్రత్యర్థి పది వికెట్లను తీయడం గమనార్హం.
ఆల్ రౌండ్ ప్రదర్శనతో..
ఇంగ్లండ్ పై బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది. మరీ ముఖ్యంగా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి స్పిన్నర్ దీప్తి శర్మ 9 వికెట్లు పడగొట్టింది. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. దీప్తి తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసింది. కాగా, శుక్రవారం ఉదయం పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని భావించిన టీమిండియా ఓవర్ నైట్ 186/6 స్కోరు వద్దనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. కాగా, ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లే (15), ఆమీ బీమోంట్ (17) మాత్రమే కొద్దిసేపు క్రీజులో నిలిచారు. పూజా వస్త్రాకర్ (3/23) వికెట్ల వేటను ప్రారంభించగా.. రేణుకా సింగ్ (1/30), రాజేశ్వరి గైక్వాడ్ (2/20) ఆమెకు అండగా నిలిచారు. దీప్తి శర్మ (4/32) అయితే చెలరేగిపోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ (21) వేగంగా ఆడేందుకు ప్రయత్నించి ఔటైంది. చివర్లో ఛార్లెట్ డీన్ (20) ప్రతిఘటనతో ఇంగ్లండ్ కు ఆమాత్రం స్కోరైనా దక్కింది. మొత్తమ్మీద 27.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. లంచ్ వరకు (ఒక్క సెషన్) కూడా ఆడలేదు.