అమ్మాయే.. అచ్చం నాన్నలాగే.. మహిళల క్రికెట్లో 'దిల్' రూబా
వీరిలో ఎందరు సక్సెస్ అయ్యారనేది తర్వాతి సంగతి. వారు తండ్రుల బాటలో కెరీర్ ను ఎంచుకోవడమే కీలక పాయింట్.
By: Tupaki Desk | 23 Jan 2025 4:30 PM GMTక్రికెటర్ల కుమారులు క్రికెటర్లు కావడం సహజమే.. భారత దిగ్గజ బ్యాట్స్ మెన్ సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరుల కుమారులు తమ తండ్రుల్లాగానే బ్యాట్ పట్టారు. వీరిలో ఎందరు సక్సెస్ అయ్యారనేది తర్వాతి సంగతి. వారు తండ్రుల బాటలో కెరీర్ ను ఎంచుకోవడమే కీలక పాయింట్.
భారత్ లోనే కాదు.. వెస్టిండీస్ కు చెందిన భారత సంతతి క్రికెటర్ శివనారాయణ్ చందర్ పాల్ కుమారుడు త్యాగరాజన్ చందర్ పాల్, ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ వంటి వారు తండ్రిలాగానే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నారు.
క్రికెట్ లో మొన్నటివరకు పురుషులదే డామినేషన్. అమ్మాయిల లేదా మహిళల క్రికెట్ కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కూడా కొన్ని సీజన్లుగా విజయవంతంగా నడుస్తోంది.
ప్రస్తుతం మలేసియాలో అండర్-19 మహిళల ప్రపంచ కప్ జరుగుతోంది. గురువారం భారత జట్టు శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణ లంక మాజీ ఆల్ రౌండర్ దిల్షాన్ తిలకరత్నే కుమార్తె లిమాన్స తిలకరత్నే. లంక నుంచి వచ్చిన మేటి ఆటగాళ్లలో దిల్షాన్ ఒకడు. అతడిలానే కుమార్తె లిమాన్స కూడా స్పిన్ ఆల్ రౌండర్ కావడం విశేషం. ఈ ప్రపంచ కప్ లో ప్రస్తుతం నాలుగు మ్యాచ్ లాడి ఆమె ఐదు వికెట్లు తీసింది. లిమాన్స వయసు 16 మాత్రమే. ఈమె గేమ్ ను చూసినవారు తండ్రిలాగే మేటి ప్లేయర్ అవుతుందని అంటున్నారు.
పురుషుల డామినేషన్ ఎక్కువగా కనిపించే క్రికెట్ లో ఓ అమ్మాయి తండ్రి బాటలోనే క్రికెటర్ కావడం విశేషమే.
కొసమెరుపు: గురువారం లంకతో మ్యాచ్ లో భారత అమ్మాయిలు 60 పరుగుల తేడాతో విజయం సాధించారు. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో తెలుగమ్మాయి గొంగడి త్రిష 49 పరుగులతో రాణించింది. భారత్ 118 పరుగుల్లో త్రిషనే టాప్ స్కోరర్. లంక కేవలం 58 పరుగులే చేయగలిగింది.