డబ్ల్యూటీసీ అత్యధిక విజయాలు దానివే..కానీ ఫైనల్ చేరలేదు..చేరదు కూడా
ఆ ఫార్మాట్ లోని అసలు సిసలు క్రికెట్ మరేదాంట్లోనూ కనిపించదు. ఎడాపెడా కొట్టేసే టి20లు.. వన్డేల కంటే టెస్టుల్లోని సొగసైన షాట్లు.. పదునైన బౌలింగ్ మరెక్కడా చూడలేం.
By: Tupaki Desk | 9 Dec 2024 1:30 PM GMTవన్డేలు వచ్చాక టెస్టుల మనుగడ కష్టం అనుకున్నారు.. టి20లు వచ్చాక ఇంకా టెస్టులు ఎవరు చూస్తారు? అని ప్రశ్నించారు.. కానీ, సంప్రదాయ ఫార్మాటే క్రికెట్ ను నిలుపుతోంది.. ఓ దశలో బోర్ కొట్టించి ఉండొచ్చు గాక.. మరో దశలో అసలు ఫలితాలు వచ్చి ఉండకపోవచ్చు గాక.. కానీ, ఇప్పటికీ ఎప్పటికీ టెస్టులంటే టెస్టులే. ఆ ఫార్మాట్ లోని అసలు సిసలు క్రికెట్ మరేదాంట్లోనూ కనిపించదు. ఎడాపెడా కొట్టేసే టి20లు.. వన్డేల కంటే టెస్టుల్లోని సొగసైన షాట్లు.. పదునైన బౌలింగ్ మరెక్కడా చూడలేం.
చాంపియన్ షిప్
ఐదేళ్ల కిందట మొదలైంది ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ). వన్డేల్లో, టి20ల్లో ప్రపంచ కప్ లు ఉన్నందున టెస్టుల్లోనూ ఆ లోటును తీర్చేందుకు దీనిని తీసుకొచ్చారు. అలాంటి చాంపియన్ షిప్ ఇప్పటికి రెండు సైకిళ్లు పూర్తిచేసుకుంది. మొదటిసారి 2019-21, 2021-23లో డబ్ల్యూటీసీ సైకిల్స్ ముగిశాయి. ప్రస్తుతం మూడోదైన 2023-25 సర్కిల్ నడుస్తోంది. దీని పాయింట్ల పట్టికలో మొన్నటివరకు టీమ్ ఇండియా టాప్ లో కొనసాగింది. కానీ, గులాబీ బంతితో ఆడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది.
అత్యధిక విజయాలు దానివే..
టెస్టు క్రికెట్ పుట్టిల్లే కాదు.. టి20లకూ పుట్టిల్లు ఇంగ్లండే. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా అక్కడే లండన్ లో జరుగుతున్నాయి. కాగా, ఇప్పటివరకు చాంపియన్ షిప్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు కూడా ఇంగ్లండే కావడం విశేషం. మొత్తం 64 టెస్టుల్లో 50 శాతం అంటే 32 గెలిచింది. టీమ్ ఇండియా రెండో స్థానంలో (53 మ్యాచ్ లలో 31 విజయాలు) ఉంది. ఆస్ట్రేలియా 48 మ్యాచ్ లలో 29 నెగ్గింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా 18 చొప్పున, శ్రీలంక, పాకిస్థాన్ చెరో 12 మ్యాచ్ లను గెలిచాయి. వెస్టిండీస్ (9) అట్టడుగున ఉంది.
ఫైనల్ చేరనేలేదు..
డబ్ల్యూటీసీ చాంపియన్ షిప్ లో అత్యధిక మ్యాచ్ లు గెలిచినప్పటికీ ఇప్పటివరకు ఇంగ్లండ్ ఫైనల్ కు చేరలేదు. 2019-21 సీజన్ లో భారత్, న్యూజిలాండ్, 2021-23 సీజన్ లో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ చేరాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా విజేతలుగా నిలిచాయి. ప్రస్తుత సర్కిల్ లోనూ ఇంగ్లండ్ ఫైనల్ కు చేరే చాన్స్ లేదు. ఎందుకంటే.. ఆ జట్టు 45.24 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. వచ్చే మార్చి వరకు టాప్-2లో ఉన్న జట్టు ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.