Begin typing your search above and press return to search.

అతడి స్థానంలో ఇతడు.. ఇద్దరూ కప్ కొట్టడంలో కీలకమయ్యారు!

ఒకరు ప్రపంచ కప్ ముందు తీవ్రంగా గాయపడ్డారు.. మరొకరు అసలే ప్రపంచ కప్ ప్రాబబుల్స్ లోనే లేరు.. కానీ, అతడి గాయంతో ఇతడికి చోటుదక్కింది

By:  Tupaki Desk   |   20 Nov 2023 9:11 AM GMT
అతడి స్థానంలో ఇతడు.. ఇద్దరూ కప్ కొట్టడంలో కీలకమయ్యారు!
X

ఒకరు ప్రపంచ కప్ ముందు తీవ్రంగా గాయపడ్డారు.. మరొకరు అసలే ప్రపంచ కప్ ప్రాబబుల్స్ లోనే లేరు.. కానీ, అతడి గాయంతో ఇతడికి చోటుదక్కింది. చివరకు ఇద్దరూ కలిసి కప్ గెలిపించేలా చేసింది. యాక్సిడెంటల్ గా జరిగిన ఈ పరిణామం గురించి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. కానీ, ఇది నిజంగా నిజం. ఆ ఇద్దరు ఎవరంటే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్, మిడిలార్డర్ బ్యాట్స్ మన్ లబుషేన్. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆదివారం టీమిండియాపై వీరి ఇన్నింగ్స్ ను అందరూ చూశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో హెడ్, లబుషేన్ పట్టుదలగా నిలిచారు. ఈ ఇద్దరిలో ఎవరు ఔట్ అయినా, పరిస్థితులు మారిపోయేవి. కానీ, భారత్ కు అవకాశం ఇవ్వకుండా చేశారు.

హెడ్ గాయం.. ఇతడికి వరం

ప్రపంచ కప్ నకు ముందు ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడింది. అందులో లబుషేన్ పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్ వన్డే జట్టులోకి తీసుకోలేదు. కానీ, ఈ టూర్ కు ముందు అనూహ్యంగా ట్రావిస్ హెడ్ గాయపడ్డాడు. చేయి విరిగిన అతడు దక్షిణాఫ్రికాతో 5 వన్డేల సిరీస్ ఆడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లబుషేన్ ను ఎంపిక చేశారు. అయితే, అతడు చక్కగా రాణించాడు. మరోవైపు ప్రపంచ కప్ దగ్గరపడుతున్నప్పటికీ హెడ్ గాయ నుంచి కోలుకోవడం అనుమానంగా మారింది.

ప్రాబుల్స్ లో లేడు..

ప్రపంచ కప్ నకు ప్రకటించిన 17 మంది ప్రాబుల్స్ లో లబుషేన్ లేడు. కానీ, హెడ్ గాయం రీత్యా అతడిని తీసుకున్నారు. హెడ్ కోలుకోవడం కాస్ ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉండడంతో లబుషేన్ ను 15 మంది జట్టులోకి తీసుకున్నారు. ఇతడి కోసం స్పిన్నర్ ఆస్టన్ ఆగర్ ను పక్కనపెట్టారు. మరోవైపు హెడ్ గాయంతో ఉన్నప్పటికీ ప్రపంచ కప్ జట్టులోకి తీసుకుని.. ఆస్ట్రేలియా పెద్ద రిస్కే చేసింది. కాగా, సెమీస్, ఫైనల్స్ కలుపుకొని ప్రపంచ కప్ లో మొత్తం 11 మ్యాచ్ లకు గాను ఆస్ట్రేలియాకు హెడ్ ఆడింది ఆరు మ్యాచ్ లే. న్యూజిలాండ్ తో ధర్మశాలలో జరిగిన లీగ్ దశ ఆరో మ్యాచ్ లో కానీ హెడ్ బరిలో దిగలేదు. ఆ మ్యాచ లో ఏకంగా సెంచరీ కొట్టి జట్టు భారీ స్కోరుకు దోహపడ్డాడు. తర్వాతి మూడు మ్యాచ్ లలో విఫలమైనా, సెమీస్ లో దక్షిణాఫ్రికాపై కీలకమైన అర్థ సెంచరీ సాధించాడు. ఫైనల్లో భారత్ పై ఏకంగా సెంచరీనే కొట్టాడు. రెండు మ్యాచ్ లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

లబుషేన్ ది మరో కథ

వరల్డ్ కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కిన లబుషేన్.. దానిని తన కెరీర్ కు తిరుగులేని సాధనంగా మలుచుకున్నాడు. మొత్తం 11 మ్యాచ్ లకు గాను మూడు అర్థ సెంచరీలు సహా మరికొన్ని విలవైన ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, ఫైనల్లో హెడ్ కు తోడుగా అతడు నిలిచిన తీరు జట్టుకు కప్ అందించింది. టెక్నికల్ గా మంచి బ్యాట్స్ మన్ అయిన లబుషేన్.. భారత పేసర్లు, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు.

కొసమెరుపు: హెడ్ గాయపడినందున, లబుషేన్ ఫామ్ లో లేనందున ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోకపోయి ఉంటే ఆస్ట్రేలియా కథ వేరేలా ఉండేది. ఎందుకంటే హెడ్ లేని సమయంలో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన మిచెల్ మార్ష్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మిడిలార్డర్ లో స్టీవ్ స్మిత్ విఫలమైనా.. లబుషేన్ ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచాడు. వీరిద్దరినీ పక్కనపెట్టి ఉంటే.. ఆసీస్ ఆల్ రౌండర్లు స్టొయినిస్, గ్రీన్ లను తీసుకోవాల్సి వచ్చేది. కూర్పు ఇబ్బందికరంగా మారేది.