Begin typing your search above and press return to search.

ఆ లైటింగ్ షోతో భారత అల్లుడి కళ్లు బైర్లు.. ఇతర క్రికెటర్లూ గగ్గోలు

భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ సగం పూర్తయ్యేసరికి రసకందాయంలో పడింది. ఫేవరెట్ జట్లయిన పాకిస్థాన్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్ కు చేరడం కష్టమేనని స్పష్టమవుతోంది

By:  Tupaki Desk   |   26 Oct 2023 8:54 AM GMT
ఆ లైటింగ్ షోతో భారత అల్లుడి కళ్లు బైర్లు.. ఇతర క్రికెటర్లూ గగ్గోలు
X

భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ సగం పూర్తయ్యేసరికి రసకందాయంలో పడింది. ఫేవరెట్ జట్లయిన పాకిస్థాన్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్ కు చేరడం కష్టమేనని స్పష్టమవుతోంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్.. ఈ నాలుగు జట్లే సెమీస్ గడప తొక్కుతాయని తెలుస్తోంది. అయితే, వీటిలో అనూహ్యంగా వెనుకబడినప్పటికీ పుంజుకున్న జట్టు ఆస్ర్టేలియా. ఫుట్ బాల్ లో బ్రెజిల్ ఎలాగో.. క్రికెట్ లో ఆస్రేలియా అలాగ. ఒక్కసారి లయ అందుకుంటే ఆపడం ఎవరి తరమూ కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. భారత్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పెద్దగా ప్రతిఘటించకుండానే ఓడిపోయిన ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా మీద కూడా చేతులెత్తేసింది. కానీ, ఆ తర్వాత నుంచి పుంజుకొంది.

హ్యాట్రిక్ విజయాలతో ముందంజ

ఢిల్లీలో బుధవారం నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా అత్యంత దూకుడుగా ఆడి.. ఏకంగా 309 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఇదే సమయంలో రన్ రేట్ నూ బాగా మెరుగుపర్చుకుంది. వాస్తవానికి ఆసీస్ గెలిచింది మూడు మ్యాచ్ లే. అంటే.. ఖాతాలో ఉన్నవి ఆరు పాయింట్లే. కానీ, గత మ్యాచ్ లో నూ పాకిస్థాన్ పై చెలరేగి ఆడిన కంగారూలు 367 పరుగుల భారీ స్కోరు సాధించారు. లంకపై 210 పరుగుల లక్ష్యాన్ని 36 ఓవర్లలోపే ఛేదించారు. కాగా, నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కంగారూ ఆల్ రౌండర్, భారత అల్లుడు గ్లెన్ మ్యాక్స్ వెల్ 40 బంతుల్లోనే సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 106 పరుగులు చేసిన అతడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గానూ నిలిచాడు.

ఆ షోతో తలనొప్పి అట..

భారత్ లో జరుగుతున్న ప్రపంచ కప్ లో మ్యాచ్ లు ఎక్కువశాతం డే నైట్ లే. దీంతోనే సాయంత్రం వేళ లైటింగ్ షో వంటి ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రేక్షకులను అలరింపజేస్తోంది. కానీ, ఇలాంటి లైటింగ్ షో ఆటగాళ్లకు మాత్రం సంకటంగా మారుతోందట. ఇదే విషయం చెప్పాడు గ్లెన్ మ్యాక్స్ వెల్. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ..లైటింగ్ షో కారణంగా క్రికెటర్లకు అనుకోకుండా తలనొప్పి వస్తోందని వాపోయాడు.

ఆస్ట్రేలియా లీగ్ లోనూ

భారత్ లో ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ బాగా ఫేమస్. ఆ లీగ్ సమయంలో లైటింగ్‌ షో ఏర్పాటు చేస్తుంటారు. పెర్త్‌ స్టేడియంలో ఓసారి ఇలాంటి షోను మ్యాక్స్ వెల్ చూశాడట. ఢిల్లీలో నెదర్లాండ్స్ తో మ్యాచ్ లోనూ లైటింగ్ షో పెట్టడంతో తలనొప్పి వచ్చేసిందని తెలిపాడు. క్రికెటర్లందరూ ఇలానే లైటింగ్ షో తో ఇబ్బంది పడేవారని పేర్కొన్నాడు. లైటింగ్ ఆగిపోయి.. వెలుతురు పోయిన తర్వాత కళ్లు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతోందని చెప్పాడు. క్రికెటర్ల విషయంలో ఇలాంటి లైటింగ్ షో సరైన ఆలోచన కాదని మ్యాక్స్ వెల్ చెబుతున్నాడు.

2 నిమిషాలు కళ్లు మూసుకుని..

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన నిన్నటి మ్యాచ్ లో లైటింగ్ షో 2 నిమిషాలు సాగింది. దీంతో ఆ 2 నిమిషాలు కళ్లు మూసుకోవడానికే ప్రయత్నించాడట మ్యాక్స్ వెల్. మైదానంలోని అభిమానులకు, టీవీల ముందు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి వస్తుందేమో కానీ.. తమకు అదొక భయంకర అనుభవం అని వాపోయాడు. కాగా, నిన్నటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 399/8 స్కోరు చేసింది. ప్రత్యర్థి నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే కుప్పకూల్చింది. అయితే, ఛేదన సమయంలో డ్రింక్స్‌ బ్రేక్‌ రాగా.. స్టేడియంలో పెద్ద డీజే సౌండ్‌ తో పాటు లైటింగ్‌ షో ఏర్పాటు చేశారు. ఇది జరుగుతుండగా ఆటగాళ్లు కళ్లు మూసుకున్నారు. ఇక మ్యాక్స్‌వెల్‌ అయితే.. చేతులతోనే కళ్లు మూసుకోవడం గమనార్హం.