ఒక్క మ్యాచ్ కోసం మారిన వరల్డ్ కప్ షెడ్యూల్
ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ తో మ్యాచ్ తేదీ మార్పునకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకుందన్న వార్త తాజాగా వెలువడింది.
By: Tupaki Desk | 3 Aug 2023 2:26 PM GMTప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కు ఉన్న ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో ఈ దాయాది జట్లు తలపడితే ఆ మజాను ఆస్వాదించేందుకు క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో పడాలని, ఇండో-పాక్ మ్యాచ్ జరగాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కూడా భావిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబరులో జరగబోయే వన్డే ప్రపంచ కప్ లో భారత్, పాక్ జట్లు ఒకే గ్రూపులో ఉండడంతో ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు పండగ చేసుకున్నారు.
అయితే, మ్యాచ్ జరిగే తేదీ విషయంలో మాత్రం కాస్త గందరగోళం ఏర్పడడం, తేదీ మార్పునకు పాకిస్థాన్ ఒప్పుకుంటుందా లేదా అన్న డైలమా ఏర్పడడంతో క్రికెట్ లవర్స్ కాస్త కంగారు పడ్డారు. ఆల్రెడీ ఆసియా కప్ మ్యాచ్ కోసం పాక్ వెళ్లేందుకు భారత్ ససేమిరా అనడంతో ఈ తేదీ మార్పునకు పాక్ ఒప్పుకోదు అన్న ప్రచారం నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ తో మ్యాచ్ తేదీ మార్పునకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకుందన్న వార్త తాజాగా వెలువడింది. భారత్ తో మ్యాచ్ తేదీ సర్దుబాటు నేపథ్యంలో మొత్తం రెండు మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చేందుకు పాకిస్థాన్ క్రికెట్‌బోర్డు (పీసీబీ) అంగీకరించింది. దీంతో, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న జరగాల్సిన హై ఓల్టేజ్ మ్యాచ్ ఒక రోజు ముందు..అంటే అక్టోబర్ 14న జరగనుంది.
అహ్మదాబాద్‌లో దేవీ నవరాత్రుల భద్రతా కారణాల రీత్యా ఈ మార్పునకు పీసీబీ ఒప్పుకుంది. ఈ వ్యవహారంపై ఐసీసీ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ షెడ్యూల్ మార్చడం వల్ల మిగతా దేశాల మ్యాచ్ ల షెడ్యూల్ పై కొంత ప్రభావం పడబోతోంది.
ఇండో–పాక్ మ్యాచ్ అక్టోబర్14న జరిగితే...హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్12న జరగాల్సిన శ్రీలంక–పాక్ మ్యాచ్ అక్టోబర్ 10కి మార్చాల్సి ఉంటుంది. అలా అయితేనే భారత్ తో మ్యాచ్ కు పాకిస్థాన్ సన్నద్ధం కాగలదు.
ఇక, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 14న చెన్నైలో బంగ్లాదేశ్–న్యూజిలాండ్, ఢిల్లీలో ఆఫ్ఘానిస్థాన్–ఇంగ్లండ్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. తాజాగా భారత్–పాక్ షెడ్యూల్ మార్పుతో వీటిలో ఒక మ్యాచ్‌ను అక్టోబర్ 13న నిర్వహించాల్సి రావచ్చు. ఏది ఏమైనా పాక్ బోర్డు తాజా నిర్ణయంతో కొన్ని మ్యాచ్ ల షెడ్యూల్ మారనుంది. సవరించిన షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ఈ వారాంతంలో ప్రకటించనుంది.