ఒకే ఓవర్లో 39 పరుగులు... యూవీ రికార్డ్ బ్రేక్ చేసిన ఎవరీ విస్సెర్?
అవును... టీ20 ప్రపంచ కప్ - 2026 టోర్నీ కోసం క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 20 Aug 2024 12:03 PM GMT2007 టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్స్ లు కొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం వెస్టిండీస్ హిట్టర్ పోలార్డ్ కూడా వరుసగా ఆరు సిక్స్ లు బాదేశాడు. ఇదే క్రమంలో నికోలస్ పూరన్, దీపేంద్ర సింగ్ లు ఓవర్ లో 36 పరుగులు చేశారు. అయితే తాజాగా ఓ బ్యాటర్ ఓకే ఓవర్ లో 39 పరుగులు రాబట్టాడు.
అవును... టీ20 ప్రపంచ కప్ - 2026 టోర్నీ కోసం క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా... ఈస్ట్ ఆసియా – ఫసిఫిక్ సబ్ రీజనల్ లో భాగంగా సమోవా - వనువాటు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో... సమోవా దేశానికి చెందిన బ్యాటర్ డెరియస్ విస్సెర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాదిన వీరుల జాబితాలో చేరాడు.
కాకపోతే వరుసగా మాత్రం కొట్టలేదు. కానీ ఒకే ఓవర్ లో 39 పరుగులు రాబట్టాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో వనువాటు బౌలర్ నిలిన్ నిపికో వేసిన 15వ ఓవర్ లో డెరియస్ విస్సెర్ ఆరు స్కిక్సులు కొట్టాడు. దీనికి తోడు అదనంగా మూడు నో బాల్స్ కూడా పడటంతో ఒకే ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి... 6, 6, 6, నోబాల్, 6, 0, నోబాల్, నోబాల్+6, 6.
ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో సుమోవా తరుపున సెంచరీ సాధించిన తొలి అటగాడిగానూ డేరియస్ రికార్డ్ సృష్టించాడు. ఇందులో భాగంగా... 62 బంతుల్లో 5 ఫోర్లు, 14 సిక్స్ ల సాయంతో 132 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇందులో 132 పరుగులు డేరియస్ చేయగా.. కెప్టెన్ కలేబ్ జస్మత్ (16) మాత్రమే రెండంకెల స్కోరు సాధించడం గమనార్హం. అనంతరం లక్ష్య చేదనకు దిగిన వనువాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా... సమోవా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.