కమిట్ మెంట్ లేని జైశ్వాల్..కెప్టెన్ కిట్ కే కిక్.. అందుకే ముంబైకి బై'
అయితే, తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. ముంబైకి గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన టీమ్ ఇండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో వచ్చిన పట్టింపే కారణమని తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 April 2025 3:44 AMతాము వచ్చిన నేపథ్యం నుంచి మర్చిపోయి.. సక్సెస్ మత్తులో తలకు పొగరెక్కించుకుంటే ఎంతటివారైనా పతనమే.. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ లో.. మొన్నటి వినోద్ కాంబ్లీ నుంచి ఇటీవలి పృథ్వీ షా వరకు మనం చూసిన ఉదాహరణలే.. ఈ కోవలోనే.. టీమ్ ఇండియా కెప్టెన్ అవుతాడని భావిస్తున్న యువ ఓపెనర్ జైశ్వాల్ ఉన్నట్లు అనుమానం కొడుతోంది.
40 సార్లకుపైగా రంజీ ట్రోఫీ టైటిల్ సాధించిన ముంబైని వీడి జైశ్వాల్ అసలు ఒక్కసారీ టైటిల్ కొట్టని గోవాకు మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనివెనుక ఏ కారణం ఉందోనని భావించారు.
అయితే, తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. ముంబైకి గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన టీమ్ ఇండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో వచ్చిన పట్టింపే కారణమని తెలుస్తోంది. గత సీజన్ లో ముంబై రంజీల్లో దారుణంగా ఆడింది. జమ్ము కశ్మీర్ వంటి జట్టు చేతిలోనూ ఓడింది.
అంతర్జాతీయ టోర్నీలు లేనప్పుడు దేశవాళీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాల ప్రకారం ముంబై తరఫున బరిలో దిగిన జైశ్వాల్ జమ్ము కశ్మీర్ తో మ్యాచ్ లో 4, 26 పరుగులే చేశాడు. అంతేగాక జట్టు కూడా ఓడిపోయింది. ఆ సమయంలో రహానే తన అసహనాన్ని వ్యక్తం చేయడం జైశ్వాల్ కు ఆగ్రహం తెప్పించిందట. తన కమిట్ మెంట్ పను ప్రశ్నించడంతో కోపం పట్టలేక ఏకంగా రహానే కిట్ బ్యాగ్ ను జైశ్వాల్ తన్నాడట. రహానేనే కాక ముంబై కోచ్ ఓంకార్ సాల్వి కూడా యశస్వి ఆటపై నిలదీయడం, ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలతో ఇక ఆ జట్టుతో కొనసాగడం కష్టమని భావించడాట.
యశస్వి కోసం.. అద్భుతంగా ఆడుతున్న కుర్రాళ్లను పక్కన పెట్టామని, తమకు గెలుపు కోసం కష్టపడే వారే కావాలని పాటిల్ మాట్లాడాడు. దీంతో ఇదంతా తనను టార్గెట్ చేసినట్లు ఉందని యశస్వి అంచనాకు వచ్చి ముంబైకి బైబై చెప్పాడని నేషనల్ మీడియా రాస్తోంది.
హైదరాబాదీపై స్లెడ్జింగ్ మూడేళ్ల కిందట 2022లోనూ రహానేతో యశస్వికి పడలేదు. దులీప్ ట్రోఫీలో హైదరాబాద్ ప్లేయర్ రవితేజను యశస్వి స్లెడ్జింగ్ చేశాడు. దీంతో రహానే అతడిని గ్రౌండ్ నుంచి బయటకు పంపాడు. మళ్లీ రహానే కెప్టెన్ గా ఉన్నప్పుడే తన కమిట్ మెంట్ పై ప్రశ్నలు రావడంతో జైశ్వాల్ ముంబైకి వీడ్కోలు పలికాడని అంటున్నారు.