యువ క్రికెటర్ రికార్డు శతకం.. సెమీస్ లో టీమిండియా
టి20 ఫార్మాట్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నుంచి పాల్గొంటోంది. పెద్దజట్లు అన్నీ ఇలానే ఆడుతున్నాయి
By: Tupaki Desk | 3 Oct 2023 7:42 AM GMTటీమిండియా యువ ఓపెనర్ అదరగొట్టాడు.. రికార్డు శతకం బాదేశాడు.. దీంతో మన జట్టు ఏకంగా సెమీ ఫైనల్స్ కు చేరిపోయింది.. మరొక్క రెండు విజయాలే.. ప్రతిష్ఠాత్మక టైటిల్ విజేతగా నిలుస్తుంది.. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా..? ఆగండాగండి.. అసలు సంగతి చెబుతాం..
ప్రపంచ కప్ మరో రెండు రోజులుంది.. ఇంకా ప్రాక్టీస్ మ్యాచ్ లు నడుస్తున్నాయ్.. యువ క్రికెటర్ రికార్డు సెంచరీ కొట్టేయడం ఏమిటి? అప్పుడే భారత్ సెమీస్ కు చేరడం ఏమిటి అనుకుంటున్నారా? అసలు విషయం ముందుంది.. చదవండి.
అటు ఆ కప్.. ఇటు ఈ కప్
బహుశా గతంలో ఎన్నడూ ఇలా జరిగి ఉండదేమో? ఓవైపు ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్.. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద ఖండమైన ఆసియా క్రీడలు.. రెండూ ఒకేసారి జరగడం. ఆసియా క్రీడలకు చైనా ఆతిథ్యం ఇస్తుండగా, భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఇక్కడ విశేషం ఏమంటే రెండూ పక్కపక్క దేశాలు. అందుకే గతంలో ఎప్పుడూ ఒకేసారి ఇలా జరిగి ఉండదని అన్నది. కాగా, ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్ లు గత వారమే మొదలయ్యాయి.
భారత్ వేట షురూ
టి20 ఫార్మాట్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నుంచి పాల్గొంటోంది. పెద్దజట్లు అన్నీ ఇలానే ఆడుతున్నాయి. మంగళవారం భారత్ తొలి మ్యాచ్ ను నేపాల్ తో ఆడింది. మొన్నటికి మొన్న మంగోలియాను ఉతికేసి 300 పైగా పరుగులు చేసిన నేపాల్ ను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా చితక్కొట్టింది. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ శతకం చేశాడు. ఈ క్రమంలో టి20ల్లో అతి చిన్న వయసు (21 ఏళ్ల 279 రోజులు)లో సెంచరీ కొట్టిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ (23 ఏళ్ల 146 రోజులు) పేరిట ఉంది. మరోవైపు జైశ్వాల్ ఆసియా క్రీడల్లో మూడంకెల స్కోరు చేసిన తొలి టీమిండియా బ్యాట్స్ మన్ గానూ నిలిచాడు. యశస్వి, రింకూ సింగ్ (37 నాటౌట్), శివమ్ దూబె (25 నాటౌట్) బ్యాట్ ఝళిపించడంతో భారత్ 202/4 స్కోరు చేసింది. నేపాల్ ను 179 పరుగులకే కట్టడి చేసింది. 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కొసమెరుపు : ఈ మ్యాచ్ ద్వారా కెరీర్ లో తొలి టి20 సెంచరీ చేసిన యశస్వి.. ఈ క్రమంలో 7 సిక్సులు, 8 ఫోర్లు కొట్టాడు. 95 పరుగుల వద్ద ఉండగా.. 46వ బంతికి స్కూప్ షాట్ కొట్టిన అతడు అది సిక్స్ అని భ్రమించి హెల్మెట్ తీసి సెంచరీ అభివాదం చేశాడు. కానీ, పరిశీలన అనంతరం ఫోర్ గా తేలింది. దీంతో సరదగా తలపట్టుకుని అయ్యో అన్నాడు. తర్వాతి బంతికే సింగిల్ తీసి.. మరోసారి హెల్మెట్ ను పక్కనపెట్టి సెంచరీ అభివాదం చేశాడు.