Begin typing your search above and press return to search.

21 ఏళ్లకు విదేశాల్లో 21 ఏళ్ల ఓపెనర్ సెంచరీ.. అప్పటికతను పుట్టలేదు..

ఆడుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత శతకం సాధించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 July 2023 6:54 AM GMT
21 ఏళ్లకు విదేశాల్లో 21 ఏళ్ల ఓపెనర్ సెంచరీ.. అప్పటికతను పుట్టలేదు..
X

ఆడుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుత శతకం సాధించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందులోనూ విదేశీ గడ్డ పై అరంగేట్ర టెస్టులో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. గొప్ప నైపుణ్యం ఉన్న బ్యాట్స్ మన్ కే అది సాధ్యం. ఇలా సెంచరీలు సాధించనవారిలో ఒకరిద్దరు తప్ప టీమిండియా తరఫున మేటి బ్యాట్స్ మన్ గా ఎదిగారు. జైశ్వాల్ ఇప్పుడు ఆ మార్గంలోనే ఉన్నాడు.

నాడు సెహ్వాగ్..

వెస్టిండీస్ తో తొలి టెస్టు లో టీమిండియా ఓపెనర్ గా కెరీర్ ఆరంభించిన జైశ్వాల్ నేపథ్యం గురించి అందరికీ తెలిసిందే. అదంతా మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక.. తాజాగా సాధించిన సెంచరీ ఘనత కూడా సాధారణమైనది కాదు. జైశ్వాల్ మినహా భారత జట్టు తరఫున విదేశాల్లో అరంగేట్ర (వారికి తొలి టెస్టు కూడా) టెస్టులోనే సెంచరీ బాదింది ఐదుగురే. వారు.. అబ్బాస్ అలీ బేగ్ (1959లో మాంచెస్టర్ లో ఇంగ్లండ్ పై 112 పరుగులు), సురీందర్ అమర్ నాథ్ (124 పరుగులు) న్యూజిలాండ్ పై ఆక్లాండ్ లో 1976లో, ప్రవీణ్ ఆమ్రే (103 పరుగులు), డర్బన్ లో 1992లో దక్షిణాఫ్రికా పై, సౌరభ్ గంగూలీ (131 పరుగులు, లార్డ్స్ లో 1996లో ఇంగ్లండ్ పై), వీరేంద్ర సెహ్వాగ్ (105 పరుగులు- 2021 నవంబరులో దక్షిణాఫ్రికాపై). ఇప్పుడు వీరి సరసన యశస్వి చేరాడు.

అతడు పుట్టనేలేదు..

సెహ్వాగ్ 2021 నవంబరు లో దక్షిణాఫ్రికా పై తొలి టెస్టులోనే సెంచరీ చేసినప్పటికీ యశస్వి ఇంకా పుట్టనే లేదు. జైశ్వాల్ 2001 డిసెంబరు 28న జన్మించాడు. కాగా.. అరంగేట్రంలోనే సెంచరీ బాదిన 17వ టీమిండియా ఆటగాడిగా అతడు నిలిచాడు. అరంగేట్రం లోనే సెంచరీ సాధించిన 17వ భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. పదేళ్ల తర్వాత తన తొలి మ్యాచ్‌ లోనే సెంచరీ చేసిన రెండో ఎడమచేతి వాటం బ్యాటర్‌ కూడా ఇతడే. 2013 మార్చిలో శిఖర్ ధావన్‌ (187) ఆస్ట్రేలియాపై సెంచరీ కొట్టాడు. ఇక ధావన్‌, పృథ్వీ షా తర్వాత ఓపెనర్‌ గా తొలి టెస్టు లోనే సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడు జైస్వాల్‌ . 2013 నవంబరులో కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా విండీస్‌ పైనే అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. నాడు అతడు మిడిలార్డర్ లో దిగి 177 పరుగులు చేశాడు. కానీ మొదటి మ్యాచ్‌ లోనే అత్యధిక పరుగులు చేసింది మాత్రం ధావనే (2013లో ఆస్ట్రేలియాపై 187 పరుగులు). ఇక టీమిండియా తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌ లో అతి తక్కువ వయసులో (21 ఏళ్ల 196 రోజులు) సెంచరీ బాదిన నాలుగో ఆటగాడు జైస్వాల్‌ . షా (18 ఏళ్ల 329 రోజులు), అబ్బాస్‌ అలీ (20 ఏళ్ల 126 రోజులు), గుండప్ప విశ్వనాథ్ (20 ఏళ్ల 276 రోజులు) ముందున్నారు

ఈ 17 మంది అరంగేట్ర సెంచరీ హీరోలు

లాలా అమర్‌ నాథ్‌, దీపక్‌ శోధన్‌, క్రిపాల్ సింగ్, అబ్బాస్‌ అలీ బేగ్ , హన్మంత్ సింగ్ , గుండప్ప విశ్వనాథ్ , సురీందర్ అమర్‌నాథ్ , అజారుద్దీన్ , ప్రవీణ్‌ ఆమ్రే , సౌరభ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ , సురేశ్‌ రైనా , ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్.

కొసమెరుపు : అరంగేట్రం లోనే సెంచరీ సాధించిన ఆటగాళ్లలో ఓ ప్రత్యేకత ఉంది. తొలి తరం క్రికెటర్ అయిన లాలా అమర్ నాథ్ కుమారుడు సురీందర్ అమర్ నాథ్ కూడా డెబ్యూ లోనే సెంచరీ బాదాడు. అలా తండ్రీ కొడుకులు తొలి మ్యాచ్ లోనే మూడంకెల స్కోరు అందుకుని అరుదైన ఘనత నెలకొల్పారు. సురీందర్ కు అన్నయ్య మొహీందర్ అమర్ నాథ్. ఈయన 1983 వరల్డ్ కప్ మీరో. ఇక విదేశాల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసివారిలో గంగూలీ, సెహ్వాగ్ మేటి బ్యాట్స్ మెన్ గా చరిత్రలో నిలిచిపోయారు.