యువీకి ధోనీ తీరని ద్రోహం.. యోగి సంచలన ఆరోపణలు.. నిజమెంత?
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్-కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
By: Tupaki Desk | 2 Sep 2024 9:30 AM GMTభారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్-కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. భారత క్రికెట్ లో రెండు ప్రపంచ కప్ విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2007 టి20 ప్రపంచ కప్ లో, 2011 వన్డే ప్రపంచకప్ లో ధోనీ-యువీ ఎలా ఆడారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి భాగస్వామ్యాలు మ్యాచ్ ల ఫలితాలను మార్చేశాయి. దేశానికి ప్రపంచకప్ లను అందించాయి. అలా.. మేటి ఆల్ రౌండర్ గా యువీ, గొప్ప కెప్టెన్ గా ధోనీ అందరికీ గుర్తుండిపోయారు. యువీ దూకుడైన స్వభావం, హుషారైన బాడీ లాంగ్వేజ్ తో, ధోనీ ఎప్పుడూ కూల్ గా ఉంటూ.. తన బుర్రలో ఆలోచనలకు పదుపు పెడుతూ జట్టుకు విజయాలు అందించారు. అయితే, మచ్చ లేని ధోనీ కెరీర్ లో ఏకైక ఆరోపణ అతడు యువరాజ్ సింగ్ ను నాశనం చేశాడనేది. దీనిని తరచూ చేస్తున్నది కూడా ఎవరో కాదు..
మిడిల్ మాస్టర్స్ మధ్య ఏం జరిగింది?
యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనీ.. టీమ్ ఇండియా మిడిల్ మాస్టర్స్. వన్డేలు, టి20ల్లో వీరిద్దరూ భాగస్వామ్యాలు నిర్మిస్తూ మిడిల్ ఆర్డర్ లో జట్టుకు అనేక విజయాలు అందించారు. అందుకే జట్టు ప్రపంచ విజేతగా నిలవగలిగింది. మైదానంలో ఇద్దరూ మంచి స్నేహితుల్లాగా కనిపించేవారు. కానీ, బయట మాత్రం అంత స్నేహం తమ మధ్య లేదంటాడు యువీ. అసలు ధోని ఫోన్ కు అందుబాటులో ఉండడు. యువీ మాత్రం పార్టీ బర్డ్. పరస్పరం విమర్శలు చేసుకునేంత విభేదాలు మాత్రం ఇద్దరి మధ్యన లేవు. అయితే, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ కు మాత్రం ధోనీ అంటే మహా కోపం. తరచూ తీవ్రమైన విమర్శలు చేస్తుంటాడు. గతంలోనూ ధోనీపై ఇలా ఆడిపోసుకున్నాడు. మళ్లీ తెరపైకి వచ్చాడు.
అందులో నిజమెంత?
తన కుమారుడి కెరీర్ ను ధోనీ నాశనం చేశాడనేది యోగ్ రాజ్ సింగ్ ఆరోపణ. పదేపదే ఇదే నింద వేస్తున్నాడు అతడు. అందుకనే ధోనీని తాను క్షమించనని అన్నాడు. యువరాజ్ కు ఇంకా నాలుగైదేళ్ల కెరీర్ ఉన్నప్పటికీ ధోనీ దానిని నాశనం చేశాడని.. దీనికి క్షమించనని చెప్పాడు. ఆత్మ పరిశీలన చేసుకుంటే అతడికీ విషయం తెలుస్తుందని పేర్కొన్నాడు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా యువరాజ్ లాంటి మరో క్రికెటర్ రాడని కొనియాడిన సంగతిని గుర్తుచేశాడు. అయితే, యువీ తండ్రి వ్యాఖ్యల్లో కొంత మాత్రమే వాస్తవం.
2011 ప్రపంచ కప్ ఫైనల్ తో
2011 ప్రపంచ కప్ ఫైనల్లో కోహ్లి ఔటయ్యాక యువరాజ్ బదులు ధోనీ బ్యాటింగ్ కు రావడం.. 95 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడడ.. సిక్స్ కొట్టి గెలిపించడంతో అసలు వివాదం మొదలైంది. అయితే, ఇక్కడ జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయం ప్రకారమే ధోనీ ముందుగా బ్యాటింగ్ కు దిగాడు. అప్పటికి క్రీజులో గంభీర్, కోహ్లి ఉన్నారు. వీరిలో కోహ్లి ఔటైతే ధోనీ, గంభీర్ ఔటైతే యువీ బ్యాటింగ్ కు వెళ్లాలనేది వ్యూహం. దీనిప్రకారమే అంతా జరిగింది. కానీ ఇదే పెద్ద తప్పన్నట్లు యోగ్ రాజ్ ఆరోపణలు చేస్తుంటాడు. ఇక యువీలో 2014 నాటికే ఫిట్ నెస్-ఫామ్ గాడితప్పాయి. ఆ ఏడాది టి20 ప్రపంచ కప్ ఫైనల్లో యువీ 21 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అసలు కనెక్ట్ కాలేకపోయాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. చివరకు 2017లో కెరీర్ ముగించాడు. ధోనీ మాత్రం 2019 వరకు వన్డేలు, టి20ల్లో కొనసాగాడు.
యెగ్ రాజ్ మాటలు నమ్మొచ్చా..?
యువీ తండ్రి యోగ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. భార్యతో విడిపోయిన అతడికి ప్రొఫెషనల్ గానూ మంచి రికార్డు లేదు. కాగా, యోగ్ రాజ్ కూడా భారత్ కు ఆడాడు. ఒక టెస్టు, ఆరు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 1980-81 న్యూజిలాండ్ సిరీస్ కు ఆశ్చర్యకరంగా ఎంపికయ్యాడు. కుడిచేతి వాటం బ్యాటర్, మీడియం పేసర్ అయిన అతడు పెద్దగా రాణించకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు. తరచూ ధోనీపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. వీటిని యువీ కూడా సమర్థించకపోవడం కొసమెరుపు.