యువీ కెరీర్ ను ముగించిన కోహ్లి.. మాజీ సహచరుడి సంచలన ఆరోపణలు!
కోహ్లి ఫిట్ నెస్, పాటలు వినడం సహా ఏ విషయంలోనైనా తన స్థాయి ప్రమాణాలు పాటించాలని అనుకుంటాడని ఉతప్ప పేర్కొన్నాడు.
By: Tupaki Desk | 10 Jan 2025 11:40 AM GMTటీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్.. టి20, వన్డే ప్రపంచ కప్ లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు యువరాజ్ సింగ్. 2011 ప్రపంచ కప్ తర్వాత అతడి కెరీర్ పీక్ లో ఉండగా క్యాన్సర్ బారిన పడినట్లు బయటపడింది. యువీ కోలుకుని రావాలని దేశమంతా ప్రార్థించింది. వారందరి దీవెనలతో యువీ తిరిగొచ్చాడు. కానీ, కొంత కాలానికే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. దీని వెనుక అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి ఉన్నాడంటూ తాజాగా మాజీ సహచరుడు ఆరోపించాడు.
క్యాన్సర్ నుంచి తేరుకుని 2017లో అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసిన యువీకి కెప్టెన్ గా ఉన్న కోహ్లి మద్దతుగా నిలవేదని ఆరోపించాడు మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. దీనికి కారణం.. కోహ్లి ఓ కెప్టెన్ గా ఆటగాళ్లు సైతం తన స్థాయి ప్రమాణాలతో ఉండాలని కోరుకోవడమేనని తెలిపాడు.
కోహ్లి ఫిట్ నెస్, పాటలు వినడం సహా ఏ విషయంలోనైనా తన స్థాయి ప్రమాణాలు పాటించాలని అనుకుంటాడని ఉతప్ప పేర్కొన్నాడు. దీని ప్రభావం యువీ కెరీర్ పై పడిందని చెప్పాడు. ‘‘2017లో యువీ ఫిట్ నెస్ బాగున్నప్పటికీ.. కోహ్లీ మాత్రం తన ప్రమాణాలకు తగ్గట్టుగా ఇంకా మారాలని అతడిపై ఒత్తిడి తెచ్చాడు. క్యాన్సర్ నుంచి కోలుకున్నందున యువీ ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఫిట్ నెస్ స్థాయిని నిర్థారించే నిబంధనలు (పాయింట్లు) మార్చాలి. రెండు పాయింట్లు తగ్గించాలని యువీ కోరినా కోహ్లి ఒప్పుకోలేదు. ఎలాగోలా ఆ టెస్టును యువీ పూర్తి చేశాడు. అయితే, 2017 చాంపియన్స్ ట్రోఫీ లో విఫలం అయ్యాడు. దీంతో వీడ్కోలుకు సిద్ధమయ్యాడు’’ అని ఉతప్ప వివరించాడు. ఇదంతా తనకు ఎవరూ చెప్పలేదని, తానే చూసి తెలుసుకున్నానని పేర్కొన్నాడు.
కాగా, 2006లో ఉతప్ప భవిష్యత్ స్టార్ గా వెలుగులోకి వచ్చాడు. 2007 వన్డే ప్రపంచ కప్ లోనూ అతడు పాల్గొన్నాడు. ఆ ఏడాది టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. కానీ, తర్వాత పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో రాణించి తిరిగొచ్చినా నిలుపుకోలేకపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో ఉతప్ప అతి కొద్ది మ్యాచ్ లే ఆడాడు. అయినప్పటికీ కోహ్లి కెప్టెన్సీ ‘‘నా దారికి రావాలి లేదా హైవేకి వెళ్లాలి’’ అనే ధోరణిలో ఉంటుందని ఉతప్ప చెబుతున్నాడు. మ్యాచ్ లో ఫలితం సాధించడం గురించే కాక.. వ్యక్తిగా సహచరులతో ఎలా ఉన్నామనేది కూడా కీలకమేనని కోహ్లిలో అది లోపించిందని తెలిపాడు.. విషయంలో రోహిత్ శర్మ అందరినీ కలుపుకొని పోతాడని కొనియాడాడు.