Begin typing your search above and press return to search.

పాక్ జట్టులో అరెస్ట్ కలకలం... హైదరాబాద్ నుంచి పరార్!

వివరాళ్లోకి వెళ్తే... భారతదేశాన్ని, హిందూ మతాన్ని విమర్శిస్తూ పాక్ విమెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ జైనబ్ అబ్బాస్ చేసిన పాత ట్వీట్‌ లు తాజాగా బయటపడ్డాయి.

By:  Tupaki Desk   |   9 Oct 2023 12:18 PM GMT
పాక్  జట్టులో అరెస్ట్  కలకలం... హైదరాబాద్  నుంచి పరార్!
X

భారత్ వేదికగా వన్ డే క్రికెట్ ప్రపంచ కప్ సంగ్రామం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి వారంరోజులు కూడా కాకమందే అప్పుడే రికార్డులమీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే దక్షిణాఫ్రికా వరుస రికార్డులు సృష్టించగా.. భారత్ తనదైన శైలిలో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇందులో భాగంగా మిడిల్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పే ప్రయత్నం చేసింది.

ఇదే సమయంలో భారత్ ఆతిథ్యాన్ని, హైదరాబాద్ బిర్యానీనీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా పాకిస్థాన్ జట్టు ఇప్పటికే ఉప్పల్ లో ఒక మ్యాచ్ ఆడింది. ఇందులో భాగంగా నెదర్లాండ్ పై పోరాడి గెలిచింది. ఈ క్రమంలో తన రెండో మ్యాచ్ ను ఈ నెల 10, మంగళవారం ఆడబోతోంది. ఇందులో భాగంగా శ్రీలంకతో తలపడబోతోంది. ఆ సంగతి అలా ఉంటే... పాకిస్థాన్ జట్టులో ఒక కలకలం చెలరేగింది.

అవును... భారత్ ఆతిథ్యాన్ని, అభిమానుల ప్రోత్సాహాన్ని, హైదరాబాద్ ఫుడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ.. ఆడిన తొలిమ్యాచ్ లోనూ గెలిచి ఉత్సాహంగా ఉన్న పాకిస్థాన్ జట్టులో ఉన్నపలంగా కలకలం రేగింది. ఇందులో భాగంగా... ఆ జట్టు విమెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ జైనబ్ అబ్బాస్ ఉన్నపలంగా హైదరాబాద్ విడిచి స్వదేశానికి వెళ్లిపోయారు.

గతంలో చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టుల నేపథ్యలో ఆమె మీద కేసు నమోదైంది.. ఫలితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆమె పాకిస్తాన్‌ కు బయలుదేరి వెళ్లారని తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా పాక్ వెళ్తారని సమాచారం.

వివరాళ్లోకి వెళ్తే... భారతదేశాన్ని, హిందూ మతాన్ని విమర్శిస్తూ పాక్ విమెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ జైనబ్ అబ్బాస్ చేసిన పాత ట్వీట్‌ లు తాజాగా బయటపడ్డాయి. దీంతో ఇండియన్ నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వినీత్ జిందాల్ అనే న్యాయవాది, సామాజిక వేత్త.. జైనాబ్ అబ్బాస్‌ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ఇదే సమయంలో సుప్రీంకోర్ట్ సీనియర్ అడ్వొకేట్ అయిన వినీత్ జిందాల్.. ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగంలో ఐపీసీలోని 153ఏ, 295, 506, 121, ఐటీ యాక్ట్‌ లోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా... ఐసీసీ స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లిస్ట్ నుంచి ఆమె పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ భయం వెంటాడిందని చెబుతున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో అరెస్ట్ చేస్తారని భయపడిన జైనాబ్ అబ్బాస్.. భారత్‌ ను విడిచి స్వదేశం బయలుదేరారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై అటు జైనాబ్ అబ్బాస్‌ తో పాటు ఐసీసీ, బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది!