Begin typing your search above and press return to search.

120 బంతుల్లో 344.. టి20ల్లో రికార్డు బద్దలైంది.. కొట్టిందెవరంటే?

అంతేకాదు తొలిసారిగా ఈ రికార్డును అందుకున్న జట్టుగా భారత్ చరిత్రలో నిలిచిపోయేది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:28 PM GMT
120 బంతుల్లో 344.. టి20ల్లో రికార్డు బద్దలైంది.. కొట్టిందెవరంటే?
X

అంతర్జాతీయ టి20ల్లో ఇటీవల హైదరాబాద్ లో దసరా పండుగ సందర్భంగా టీమ్ ఇండియా దుమ్మురేపింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో 297 పరుగులు చేసింది. కేరళ యువ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ చెలరేగి ఆడి కేవలం 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (35 బంతుల్లో 75), ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47 పరుగులు) దూకుడుతో భారత్ ఓ దశలో 300 దాటేస్తుందేమో అనిపించింది. అదే జరిగితే టెస్టు హోదా ఉన్న దేశాల మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో 300 మార్క్ దాటిన రికార్డు మన సొంతం అయ్యేది. అంతేకాదు తొలిసారిగా ఈ రికార్డును అందుకున్న జట్టుగా భారత్ చరిత్రలో నిలిచిపోయేది. అయితే, టీమ్ ఇండియా 297 పరుగుల వద్దనే నిలిచిపోయింది.

నిరుడు నేపాల్..

గత ఏడాది జరిగిన టి20 మ్యాచ్ లో నేపాల్ జట్టు మంగోలియాపై మూడే వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. గత ఏడాది ఆసియా క్రీడల్లో నేపాల్ ఈ రికార్డు అందుకుంది. దీంతో అంతర్జాతీయ టి20ల్లో తొలిసారిగా 300 మార్క్ దాటిన దేశంగా నిలిచింది. అయితే, నేపాల్, మంగోలియాలు టెస్టు హోదా ఉన్న దేశాలు కావు. దీంతో ఈ రికార్డుకు అంత ప్రాధాన్యం దక్కలేదు. ఇది అంతర్జాతీయ టి20 మ్యాచ్ అయినప్పటికీ 300 పరుగుల రికార్డు రికార్డులకెక్కలేదన్నమాట. అయితే, ఈ ఏడాది సీషెల్స్ పై జింబాబ్వే 286 పరుగులు చేసింది. 2019లో అఫ్గానిస్థాన్ జట్టు 278 కొట్టింది. ఇదే ఏడాది చెక్‌ రిపబ్లిక్ టీమ్ తుర్కియేపై 278 పరుగులు సాధించింది.

అంతకుమించి..

ఈ ఏడాదే టి20ల్లో 286 పరగులు చేసిన జింబాబ్వే ఇప్పుడు ఏకంగా 300 దాటేసింది. ప్రపంచ రికార్డు కూడా సృష్టించింది. టి20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ టోర్నీలో గాంబియాతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 344 పరుగులు కొట్టింది. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇందులో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133 నాటౌట్) దుమ్మురేపాడు. 43 బంతులాడిని రజా.. 7 ఫోర్లు, 15 సిక్స్‌ లతో చెలరేగాడు.

38 ఏళ్ల వయసులో కుర్రాడిలా..

పాకిస్థాన్ లో పుట్టి జింబాబ్వేలో స్థిరపడి ఆ దేశానికి ఆడుతున్న సికిందర్ రజా వయసు ప్రస్తుతం 38. ఈ వయసులోనూ కుర్రాళ్ల గేమ్ అయిన టి20ల్లో రజా చెలరేగి ఆడుతున్నాడు. తాజా సెంచరీతో జట్టుకు గొప్ప రికార్డు సాధించిపెట్టాడు. అంతేకాదు.. జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగానూ రజా రికార్డులకెక్కాడు. కాగా, ఈ మ్యాచ్ లో జింబాబ్వేకు చెందిన తడివానాశే మారుమణి (62; 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌ లు), బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో), క్లైవ్ మండాడే (53; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు. దీంతో జింబాబ్వే రికార్డు స్థాయిలో 344 పరుగులు చేసింది.