క్యాన్సర్ తో శుష్కించి.. ఓడిపోయిన దిగ్గజ క్రికెటర్
ఆ దిగ్గజ క్రికెటర్. అతడు వైదొలగాక.. సమర్థుడైన కెప్టెన్ రాలేదంటేనే అతడెంతటి గొప్ప ఆటగాడో తెలుసుకోవచ్చు.
By: Tupaki Desk | 3 Sep 2023 9:35 AM GMTఒకవిధంగా చెప్పాలంటే.. ఆ దేశ క్రికెట్ ను ముందుండి నడిపించాడు ఆ దిగ్గజ క్రికెటర్. అతడు వైదొలగాక.. సమర్థుడైన కెప్టెన్ రాలేదంటేనే అతడెంతటి గొప్ప ఆటగాడో తెలుసుకోవచ్చు. క్రికెటర్ గా అనేక ఘనతలను సొంతం చేసుకున్న అతడు.. మైదానంలో వెన్నచూపని వాడిగా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్సీ భారం మోస్తూ.. కొత్త బంతిని పంచుకుంటూ.. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా లోయార్డర్ లో రాణిస్తూ పుష్కర కాలం పాటు జాతీయ జట్టుకు గొప్ప సేవలందించాడు.
గ్రాంట్ ఫ్లవర్, ఆండీ ఫ్లవర్ సోదరులతో పాటు జింబాబ్వే క్రికెట్ ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. పెద్దపేగు, కాలేయ క్యాన్సర్ బారిన పడిన అతడు కొన్నాళ్లుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్రికెటర్ గా చక్కటి ఫిట్ నెస్ తో కనిపించే స్ట్రీక్.. వ్యాధి బారిన పడ్డాక శుష్కించి పోయాడు. అందులోనూ క్యాన్సర్ కావడంతో అతడు ఎంత ఫిట్ నెస్ ఉన్నవాడైనప్పటికీ కోలుకోలేకపోయాడు. ఆదివారం తెల్లవారుజామున జీవితమనే మైదానం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయాడు.
జింబాబ్వే తరఫున 1993 - 2005 మధ్య స్ట్రీక్ 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో 4,933 పరుగులు, 455 వికెట్లు తీశాడు. ఆ దేశం తరఫున టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు.. వేల పరుగులు, 200 పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు అతడి పేరిటే ఉంది. 2016-18 వరకు జింబాబ్వే, దేశవాళీ లీగ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
గతవారమే చనిపోయాడంటూ..
జింబాబ్వేలో స్థిరపడిన తెల్ల జాతికి చెందినవాడు హీత్ స్ట్రీక్. ప్రస్తుతం 49 ఏళ్ల వయసు. 18 ఏళ్ల కిందటే మంచి ఫామ్ లో ఉండగానే రిటైరయ్యాడు. దీనికి ఆ దేశ రాజకీయాలు కూడా ఒక కారణం. బోర్డు కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండిపోవడంతో స్ట్రీక్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు మళ్లీ రాలేదు. కాగా, దాదాపు రెండేళ్ల నుంచి స్ట్రీక్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స పొందుతూనే ఉన్నాడు. కొన్నాళ్ల నుంచి ఆస్పత్రిలో చేరిన అతడు చనిపోయాడంటూ గత వారం కథనాలు వచ్చాయి. స్ట్రీక్ సహచరుడు, అతడితో కొత్త బంతిని పంచుకున్న హెన్రీ ఒలాంగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. సెహ్వాగ్, అశ్విన్ వంటి భారత క్రికెటర్లరు సంతపాలు కూడా తెలిపారు. కానీ, స్ట్రీక్ చనిపోలేదని తెలిసి నాలుక్కర్చుకున్నారు. అయితే , ఆ దివారం అందరినీ విడిచి వెళ్లిపోయాడా ఆల్ రౌండర్.