Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి పోటీ...తాత తండ్రి సీటు నుంచే...?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కోడలు

By:  Tupaki Desk   |   24 July 2023 4:13 AM GMT
బ్రాహ్మణి పోటీ...తాత తండ్రి సీటు నుంచే...?
X

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కోడలు, లోకేష్ సతీమణి నందమూరి బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేస్తారా. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీకి దిగుతారా అంటే ప్రచారం చూస్తే అలాగే జరుగుతోంది. తన తండ్రి నందమూరి బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి 2024 ఎన్నికల్లో బ్రాహ్మణి పోటీ చేయవచ్చు అన్నది గట్టిగా వినిపిస్తున్న మాట.

మరి బాలయ్య ఏమి చేస్తారు. ఆయన హ్యాట్రిక్ కలలు ఏమి కావాలి అంటే రాజకీయ లెక్కలు వేరే కధలు చెబుతున్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించాక అంతా పురుష ఎమ్మెల్యేలే గెలిచారు. తప్ప మహిళలు ఒక్కసారి గెలవలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళలకు ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. దాంతో ఈసారి వైసీపీ మహిళా సెంటిమెంట్ ని అస్త్రాన్ని వాడుతోంది.

రాయలసీమ రీజియన్ వైసీపీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి వ్యూహం మేరకు హిందూపురంలో 2024 ఎన్నికల్లో మహిళా అస్త్రాన్ని బాలయ్య మీద ప్రయోగించనున్నారు. ఆ పార్టీ హిందూపురం ఇంచార్జి పదవిని టీఎన్ దీపికకు అప్పగించింది. దాంతో ఇపుడు టీడీపీ ఆలోచనలు కూడా మారుతున్నాయని అంటున్నారు.

ఇక వైసీపీ 2014లో నవీన్ నిశ్ఛల్ కి టికెట్ ఇచ్చింది. అపుడు బాలయ్య చేతిలో ఆయన ఓడారు. 2019లో ఇక్బాల్ కి టికెట్ ఇచ్చినా పార్టీ ఓడింది. జగన్ వేవ్ లో సైతం బాలయ్య గెలిచారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి గెలవాలని కసిగా ఉన్నారు బాలయ్య. ఇంకో వైపు చూస్తే నవీన్ నిశ్చల్ కి కార్పోరేషన్ చైర్మన్ పదవిని జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చారు.

అలాగే బాలయ్య మీద ఓడిన ఇక్బాల్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయినా ఈ ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరు సాగడంతో వైసీపీ హిందూపురంలో దెబ్బ తింటోంది. దాంతో సరైన వ్యూహంతో మహిళకు ఇంచార్జి పదవి ఇచ్చారు. 2024 లో దీపిక ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అలా వైసీపీ చెప్పకనే చెప్పేసింది.

ఇక హిందూపురంలో మహిళా ఓట్లు ఎక్కువ. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ మహిళలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆసరగా చేసుకుని వైసీపీ ఈ విధంగా పావులు కదుపుతోంది. దాంతో బాలయ్య విజయానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్న ఆలోచనలో టీడీపీ ఉందిట. 2014 నుంచి 2019 మధ్యలో బాలయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

వాటి ఫలితంగా ఆయన 2019 లో మరోసారి గెలిచారు. కానీ గత నాలుగేళ్ళలో బాలయ్య ఏమీ పెద్దగా చేయలేదు. దాంతో పాటు రెండుసార్లు చూశారు. కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. ఈ పరిణామాలను తీసుకుని వైసీపీ మహిళా అభ్యర్ధి అంటూ ముందుకు వస్తోంది. దాంతో టీడీపీ కూడా మహిళకే టికెట్ అంటోంది. ముందు బాలయ్య సతీమణి వసుంధరను అనుకున్నారని టాక్. ఆమె బాలయ్యతో పాటు హిందూపురంలో తిరిగారు. ఆమెకు క్యాడర్ పరిచయం ఉంది. జనాలకు కూడా తెలుసు.

అయితే ఇపుడు టీడీపీ కొత్త ఆలోచనలు చేస్తోందిట. వసుంధర కంటే బ్రాహ్మణినే బరిలోకి దింపితే అన్నీ కలసి వచ్చి విజయం సునాయాసం అవుతుందని, దాంతో మరి బాలయ్య కూతురు అనివార్యంగా రంగంలోకి రావాల్సి వస్తోందని హిందూపురం టాక్. మరి బాలయ్యకు ఎక్కడ నుంచి సీటు ఇస్తారో తెలియదు. ఈసారి ఎన్నికల్లో బాలయ్యను ప్రచారానికి వాడుకుని రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదన కూడా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి నిజంగా బ్రాహ్మణి పోటీ చేస్తే మాత్రం హిందూపురం టాక్ ఆఫ్ ది ఏపీ అవడం ఖాయం అంటున్నారు.