రెండేళ్ల తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఏజెంట్' సినిమా ఏప్రిల్ 28, 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 14 March 2025 4:45 PM ISTఅఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఏజెంట్' సినిమా ఏప్రిల్ 28, 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు దఫాలుగా వాయదా పడ్డ ఏజెంట్ సినిమా కోసం అప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనగానే ఒకింత ఆసక్తిని కనబర్చారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమాకు మినిమం వసూళ్లు నమోదు కాలేదు. అంతే కాకుండా సినిమాను ఓటీటీలో చూడ్డానికి ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కి నిరుత్సాహం, అసహనం కలిగే విధంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఏజెంట్ సినిమాను సైతం వెంటనే స్ట్రీమింగ్ చేయాలని భావించారు. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఫ్లాప్ కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌కి రీ ఎడిట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, అందుకే ఆలస్యం అవుతుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు. కానీ సినిమా రీ ఎడిట్ ఆలోచన లేదని మేకర్స్ తేల్చి చెప్పారు. సోనీ లివ్ ఏ కారణంతో సినిమా స్ట్రీమింగ్‌ను ఇన్నాళ్లు వాయిదా వేసిందో కానీ ఎట్టకేలకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండేళ్ల ఎదురుచూపులకు తెర పడింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అంతకు ముందు వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఫ్లాప్ అయిన ఈ సినిమాను జనాలు ఓటీటీలో చూడాలని ఆ సమయంలో అనుకున్నారు. కానీ రెండేళ్లు ఆలస్యం కావడంతో సినిమా గురించి జనాలు దాదాపు మరచి పోయారు. పైగా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కావడం వల్ల కూడా ప్రేక్షకులు స్ట్రీమింగ్‌పై ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట తెగ సందడి చేస్తున్న ఏజెంట్ స్ట్రీమింగ్ వార్తల కారణంగా ఏమైనా ప్రేక్షకులు చూస్తారేమో చూడాలి.
అఖిల్ ఏజెంట్ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయాడు. గత ఏడాదిలోనే అఖిల్ సినిమా ప్రారంభం అయిందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. అఖిల్ తదుపరి సినిమా విషయంలో అస్సలు లైట్ తీసుకోవద్దని, కచ్చితంగా ప్రతి విషయాన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాను రూపొందించాలని నాగార్జున భావిస్తున్నాడట. అందుకే అఖిల్ కొత్త సినిమాకు ఆలస్యం అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఏడాదిలో అఖిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.