Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీ ఇప్పుడు OTTల రాజ్యం! పరిస్థితి అలా మారిందా?

ఓటీటీల నిర్వాహకులు పెట్టిన కండీషన్లకు సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటే.. అలాంటి సీనే కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 6:59 AM GMT
సినీ ఇండస్ట్రీ ఇప్పుడు OTTల రాజ్యం! పరిస్థితి అలా మారిందా?
X

ఓటీటీలు.. ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓటీటీల నిర్వాహకులు పెట్టిన కండీషన్లకు సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటే.. అలాంటి సీనే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చిత్రసీమను ఓటీటీలు శాసిస్తున్నాయనే చెప్పాలి.

ఒకప్పుడు ఇండస్ట్రీకి కల్పతరువుల్లా ఓటీటీలు ఉండేవి. భారీ స్థాయిలో సినిమాలు కొనుగోలు చేసేవి. పోటీపడి మరీ దక్కించుకుని స్ట్రీమింగ్ చేసేవి. కొన్ని మూవీల షూటింగ్ మొదలవ్వగానే డీల్స్ కుదుర్చుకుని.. అడ్వాన్సులు కూడా ఇచ్చేసేవి. దీంతో అనేక మంది టాలీవుడ్ కు చెందిన నిర్మాతలు.. ఓ రేంజ్ లో సినిమాలను రూపొందించేశారు.

చెప్పాలంటే ఓటీటీల నమ్ముకుని ఎక్కువ సినిమాలు తీసేశారు. ఓటీటీ డీల్స్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు కూడా అందుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోయింది. పెద్ద.. చిన్న తేడా లేకుండా అన్ని సినిమాలను ఒకే విధంగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వెంటనే కొనేందుకు ముందుకు రావడం లేదు.

ఒకప్పుడు షూటింగ్ కు ముందు అడ్వాన్సులు ఇచ్చిన ఓటీటీలు.. ఇప్పుడు కంటెంట్ నచ్చితే గాని కొనుగోలు చేయడం లేదు. ఆడియన్స్ లో ఉన్న బజ్ బట్టి డిసైడ్ అవుతున్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్.. అన్నీ రివీల్ అయ్యాక అప్పుడు నిర్ణయించుకుంటున్నాయి. కొన్ని సార్లు సినిమాను చూసిన తర్వాత కొనుగోలు చేస్తున్నాయి.

అందుకు ముఖ్య కారణమేంటంటే.. ఓటీటీల దగ్గర కూడా మంచి కంటెంట్ ఉంటుంది. కాబట్టి మూవీ కంటెంట్ చూసి తీసుకుంటే డబ్బులు వృధా అవ్వవని ఆలోచిస్తున్నాయి. ఆ డబ్బులతో కొన్ని మూవీలు తీయొచ్చు కదా అని అనుకుంటున్నాయేమో. ఒకవేళ మూవీ కొనుగోలు చేసినా.. తాము చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని చెబుతున్నాయి.

రీసెంట్ గా కొన్ని సినిమాల విషయంలో అదే జరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీని బట్టి పరిస్థితి ఎలా మారిందో క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఓటీటీలు ఉన్నాయి క‌దా సినిమాలు రూపొందించేస్తే నిర్మాతల సంగతి అంతే. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా అలాంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఓటీటీలను న‌మ్ముకొని మూవీలు చేసే రోజులు పోయాయని, బడ్జెట్ లో సగం ఓటీటీల నుంచే వ‌చ్చేస్తుందని ధైర్యంగా సినిమాలు తీసి, ఇప్పుడు కొందరు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పలు భారీ మూవీస్ కూడా ఓటీటీ మార్కెట్ లేక‌పోవ‌డంతో రిలీజ్ అవ్వడం లేదని చెప్పారు. దీంతో నిర్మాతలంతా ఇకపై అయినా జాగ్రత్త పడితే మంచిది!