అమరన్, మట్కా ఓటీటీ ఎప్పుడు? ఎందులో?
దీపావళి కానుకగా వచ్చిన 'లక్కీ భాస్కర్', 'అమరన్', 'క' సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
By: Tupaki Desk | 30 Nov 2024 9:24 AM GMTదీపావళి కానుకగా వచ్చిన 'లక్కీ భాస్కర్', 'అమరన్', 'క' సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. నాలుగు వారాలు పూర్తి కావడంతో ఇప్పటికే లక్కీ భాస్కర్, క సినిమాలు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అమరన్ సినిమాను ఓటీటీ ద్వారా తీసుకు రాలేదు. అయిదవ వారంలోనూ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయిదు వారాలు పూర్తి చేసుకున్న తర్వాత అమరన్ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈవిషయాన్ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. అమరన్ సినిమా ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెబుతూ నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది.
తమిళ్‌తో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలోనూ డిసెంబర్ 5న అమరన్ సినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతుంది. అయిదు వారాల థియేట్రికల్ రన్ తర్వాత కూడా అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి ఉంది. శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.250 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగా విడుదల అయిన అమరన్ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తే చాలా పెద్ద విషయం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా రూ.250 కోట్ల వసూళ్లు సాధించడం రికార్డ్‌గా టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ టాప్ హీరోల సరసన శివ కార్తికేయన్‌ను నిలిపిన అమరన్ సినిమా డిసెంబర్ 5న ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీపావళికి వచ్చిన సినిమాలు మూడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత కొన్ని రోజులకే వచ్చిన వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరిల 'మట్కా' సినిమాకి నిరాశ మిగిలింది. విడుదలకు ముందు సినిమా గురించి చాలా చర్చ జరిగింది. వరుణ్ తేజ్ గెటప్‌లతో పాటు, పలు విషయాల గురించి ప్రముఖంగా చర్చ జరగడంతో మట్కా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అంతా భావించారు. కానీ మట్కా సినిమాకు చాలా దారుణమైన కలెక్షన్స్ నమోదు అయ్యాయి. మొదటి రెండు మూడు రోజుల్లోనే పెద్ద ఎత్తున స్క్రీన్స్ సంఖ్య తగ్గడం జరిగింది.
మట్కా సినిమా నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కావాల్సి ఉన్నా డిజాస్టర్ ఫలితాన్ని చవి చూసిన కారణంగా ఒక వారం ముందుగానే ఓటీటీ ద్వారా మరోసారి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా డిసెంబర్ 5న మట్కా సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. రెండు సినిమాలు ఒకే రోజున స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం. అమరన్ సినిమాతో పాటు ఈ వీకెండ్‌కి వరుణ్ తేజ్, మీనాక్షిల యొక్క మట్కా సినిమా సైతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచబోతుంది.
ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు అదే రోజు విడుదల కాబోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే డిసెంబర్ 5న అంటే ఆ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్న రోజున అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పుష్ప 2 టికెట్లు దొరకని వారి కోసం మట్కా, అమరన్ సినిమాలు ఓటీటీ లో రెడీగా ఉంటాయి.