గేమ్ ఛేంజర్: ఓటీటీలో మరో ట్విస్ట్
అయితే ఈ సినిమా హిందీ హక్కుల విషయంలో మరో కొత్త ట్విస్ట్ ఇప్పుడు బయటకొచ్చింది. సాధారణంగా ఓటీటీ హక్కులన్నీ ఒకే వేదిక దక్కించుకోవడం చూస్తూనే ఉంటాం.
By: Tupaki Desk | 5 March 2025 1:27 PM ISTసినిమా థియేటర్స్‌లో విడుదలైన తర్వాత ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ, భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్న సినిమాలు సాధారణంగా ఓటీటీలో త్వరగా రానివ్వరు. కానీ, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ మాత్రం ఈ విషయంలో విభిన్నంగా నిలిచింది. సినిమా రిలీజ్ అయ్యాక నెల దాటకముందే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.
అయితే ఈ సినిమా హిందీ హక్కుల విషయంలో మరో కొత్త ట్విస్ట్ ఇప్పుడు బయటకొచ్చింది. సాధారణంగా ఓటీటీ హక్కులన్నీ ఒకే వేదిక దక్కించుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అలాంటి పరిస్థితే లేదు. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులను జీ5 దక్కించుకుంది. అంటే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ వెళ్లాల్సిందే. కానీ, హిందీలో చూడాలంటే మాత్రం జీ5 సబ్‌స్క్రిప్షన్ అవసరం.
ఇది ఓటీటీ బిజినెస్ లో న్యూ స్ట్రాటజీ కావచ్చు. హిందీలో మన ఫ్లాప్ సినిమాలు కూడా ఒక రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నాయి. ఇక నిర్మాత దిల్ రాజు హిందీ వెర్షన్ ను సెపరేట్ డీల్ తో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై తొలినాళ్లలో భారీ అంచనాలు ఉండగా, థియేటర్స్‌లో రిలీజ్ తర్వాత మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కథనానికి అందరూ మంచి మార్కులు వేయకపోయినా, విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం సినిమాను ఒక కొత్త లెవల్‌లో నిలబెట్టాయి.
థియేట్రికల్ రన్ అంతంత మాత్రమే అనిపించినా, హిందీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా కొత్తగా ఆడియన్స్‌ను చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే హిందీ వెర్షన్ ఆలస్యం కావడం మరో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు హిందీ వెర్షన్ రిలీజ్ డేట్‌ను జీ5 ప్రకటించలేదు. సాధారణంగా ఒకేసారి అన్ని భాషల్లో ఓటీటీలో విడుదల చేస్తుంటారు. కానీ, హిందీలో మాత్రం ఆలస్యం అవ్వడం వెనుక స్పష్టమైన కారణాలు తెలియడం లేదు.
దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా, భారీ తారాగణం కూడా ఉండటంతో హిందీ మార్కెట్‌లో కూడా మంచి రీచ్ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టకపోయినా, ఓటీటీలో ఈ సినిమాకు బాగా డిమాండ్ ఏర్పడిందని సమాచారం. అయితే, భిన్నమైన ఓటీటీ వేదికలు సినిమాకు ఎలా సహాయపడతాయనే దానిపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.