పిల్లలు కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నాం!
బొమ్మరిల్లు హాసినిగా అందరి హృదయాలను గెలుచుకున్న జెనీలియా
By: Tupaki Desk | 21 July 2023 4:21 AM GMTబొమ్మరిల్లు హాసినిగా అందరి హృదయాలను గెలుచుకున్న జెనీలియా సహనటుడు రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల నటనకు దూరమై వ్యక్తిగత కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తున్న జెనీలియా చాలా కాలానికి తిరిగి నటనలోకి పునరాగమనం చేస్తోంది. వాస్తవానికి జెనీలియా దేశ్ ముఖ్ తెలుగు-తమిళం-హిందీ పరిశ్రమల్లో విజయవంతమైన నటి. నటుడు కం నిర్మాత రితేష్ దేశ్ ముఖ్ కు ప్రియమైన భాగస్వామి. పిల్లలు రియాన్ - రహిల్ లకు జెన్నీ సూపర్ మమ్. నటనకు చాలా కాలంగా గ్యాప్ ఇచ్చిన జెనీలియా ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ పై దృష్టి సారించింది. ఇటీవలే మరాఠీ బ్లాక్ బస్టర్ 'వేద్'లో నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లలో టాప్ 2 చిత్రంగా నిలిచింది. ఇప్పుడు జెనీలియా ఓటీటీ రంగంలోను ప్రవేశిస్తోంది. తాజాగా 'ట్రయల్ పీరియడ్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రయల్ పీరియడ్ కుటుంబ సమేతంగా వీక్షించదగిన వెబ్ సిరీస్ అని జెనీలియా భరోసానిస్తోంది.
తాజా ఇంటర్వ్యూలో జెనీలియా ఓటీటీ కంటెంట్ పై మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. OTTలో కుటుంబానికి అనుకూలమైన కంటెంట్ లేకపోవడం వల్లనే తాను 'ట్రయల్ పీరియడ్' ని ఎంచుకోవడానికి కారణమని జెనీలియా పేర్కొంది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని కంటెంట్ ని ఆనందించే అవకాశాన్ని ప్రజలు కోల్పోయారని జెనీలియా వ్యాఖ్యానించారు. నేను చాలా సినిమాలు షోలను (OTTలో) చూస్తాను. కానీ నా పిల్లలతో కలిసి చూడలేను. కాబట్టి భారతదేశ సంస్కృతి ప్రకారం....వినోదాన్ని కలిసి చూడాలి.
సినిమాలు మన కుటుంబ వేడుకలలో భాగం. మనం ఆదివారం కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా సినిమాకి వెళ్లడం చేస్తాం. ఇది చాలా ఏళ్లుగా చాలా ఇళ్లలో ఆచారం. మనం సినిమాలు చూస్తూ పెరిగాం. అదే విధంగా ఓటీటీలో సినిమాలు సిరీస్ లను చూడగలగాలి'' అని జెనీలియా పేర్కొన్నారు. తన మునుపటి హిట్ 'వేద్' కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని చెప్పిన జెనీలియా....అన్ని వయసుల వారు చూడగలిగే ప్రాజెక్ట్ ను తాను ఎంచుకున్నట్లు చెప్పారు.
ట్రయల్ పీరియడ్ లో జెనీలియా అనా అనే పాత్రను పోషిస్తోంది. ఇందులో ఉద్యోగానికి వెళ్లే ఒంటరి తల్లిగా జెనీలియా నటించింది. అయితే తన బిడ్డ 'అద్దె తండ్రి' కావాలని తనను డిమాండ్ చేస్తుంది. అయితే దానికి జెనీలియా ఏలాంటి పరిష్కారాన్ని వెతికిందో సిరీస్ ని వీక్షించి తెలుసుకోవాల్సిందే. గృహిణిగా అనుభవాలు తన నటనా జీవితానికి సహకరించాయని తాజా ఇంటర్వ్యూలో జెనీలియా తెలిపారు. తన నిజజీవిత మాతృత్వ ప్రవృత్తులు తెరపై తన పాత్రకు సహాయపడిందని ఈ సందర్భంగా జెనీలియా వెల్లడించింది.
ఏ తల్లి పాత్ర అయినా తల్లికి దక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీ పిల్లల కోసం చేసే చిన్న పనిని వివరించడం సాధ్యం కాదు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏమి చేస్తారో వివరించడం సాధ్యం కాదు. వారి దినచర్య లేదా రోజువారీ పనులు... తల్లిదండ్రులు మాత్రమే అర్థం చేసుకుంటారు... అని జెనీలియా తెలిపారు.
తాను స్క్రిప్ట్ చదివిన కొన్ని గంటల్లోనే ట్రయల్ పీరియడ్ చేయడానికి అంగీకరించినట్లు జెనీలియా వెల్లడించింది. హిందీలో మళ్లీ పని ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ స్క్రిప్ట్ వచ్చింది. సాధారణంగా స్క్రిప్ట్ దొరికినప్పుడు టైమ్ తీసుకుని ఇంటర్వెల్ ఇస్తూ చదువుతాను. కానీ ట్రయల్ పీరియడ్ మొత్తం స్క్రిప్ట్ ని ఒక గంటలో చదవడం ముగించాను. నేను ఈ స్క్రిప్టులో ఫ్రెష్ నెస్ ని ప్రత్యేకతను గుర్తించాను. తక్షణమే నాకు ఆసక్తిని కలిగించింది.. అని జెనీలియా తెలిపింది. ట్రయల్ పీరియడ్ జూలై 21న జియో సినిమాలో ప్రసారం కానుంది.