'బుల్లిరాజు' ఎఫెక్ట్... ఓటీటీలకు ప్రభుత్వం హెచ్చరికలు!
ఇటీవల వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో బుల్లిరాజు పాత్రదారి బాలనటుడి పాత్ర ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Feb 2025 7:01 AM GMTఇటీవల వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో బుల్లిరాజు పాత్రదారి బాలనటుడి పాత్ర ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. అతడుచేసే వ్యాఖ్యలపట్ల స్పందించిన అతడి తండ్రి.. "మావాడు ఓటీటీలో వెబ్ సిరీస్ లు చూసి పాడైపోయాడు!" అన్నట్లుగా చెప్పే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో... ఓటీటీల్లో వచ్చే సినిమాలు, సిరీస్ లపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఏమాత్రం ఫిల్టరింగ్ ఉండటం లేదని.. అడల్ట్ కంటెంట్ కు అడ్డూ అదుపూ ఉండటం లేదనే కామెంట్లు.. బీప్స్ కూడా వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు, ఓటీటీ వెబ్ సైట్ లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ నియమాలు (2021) ప్రకారం ప్రకారం నిబంధనలు పాటించాలని సూచించింది. ప్రధానంగా పిల్లలు అనుచితమైన కంటెంట్ ను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి స్వీయ నియంత్రణను అమలుచేయాలని సూచించింది.
"ఏ" రేటెడ్ కంటెంట్ కోసం యాక్సెస్ నియంత్రణను అమలు చేయాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లను కేంద్రం కోరింది. ఇటీవల ఓ స్టాండ్ అప్ కామెడీ షోలో పాడ్ కాస్టర్ రణవీర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తొలగించమని ఆదేశించేవరకూ అది యూట్యూబ్ లోనే ఉండటాన్ని ప్రస్థావించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం... ఆన్ లైన్ క్యూరేటెడ్ కంటెంట్ (ఓటీటీ), సోషల్ మీడియా ప్రచురణకర్తలకు సంబంధించిన పలు ఫిర్యాదులు అందుకొన్నట్లు తెలిపింది! ఈ సమయంలో.. చట్టం ద్వారా నిషేధించబడిన ఏ కంటెంట్ ను ప్రసారం చేయకూడదని.. వయస్సు ఆధారిత కంటెంట్ వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది.
ఇదే సమయంలో.. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని.. నైతిక నియమాల ఉల్లంఘన జరిగినట్లు తేలితే ఓటీటీలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.