మరో ఓటీటీ దిగ్గజం పాస్ వర్డ్ షేరింగుకి బ్రేకులు
తాజా సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌కు ముగింపు పలకాలని యోచిస్తోంది.
By: Tupaki Desk | 10 Aug 2024 12:30 AM GMTఓటీటీలు ఇటీవల మైండ్ గేమ్ ఆడుతూ సబ్ స్క్రైబర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌కు ముగింపు పలకాలని యోచిస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లో సెప్టెంబరులో పాస్‌వర్డ్ షేరింగ్‌కు తొలిగా బ్రేకులు వేస్తామని డిస్నీ చెబుతోంది. అయితే భారతదేశంలో అది ఎప్పుడు అమలవుతుందనే దానిపై సమాచారం లేదు.
గత ఏడాది జూలైలో నెట్‌ఫ్లిక్స్ తమ కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులకు పాస్‌వర్డ్‌లను షేర్ చేస్తున్న సభ్యులకు ఇమెయిల్‌లను పంపింది. భారతదేశంలో తన యాంటీ-పాస్‌వర్డ్ గేమ్ తో చెక్ పెట్టడం ప్రారంభించింది. ఇప్పుడు డిస్నీ తన సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకునే ప్రయత్నంలో ఈ సెప్టెంబర్ నుండి పాస్‌వర్డ్ షేరింగ్‌ను బ్యాన్ చేయనుంది. CEO బాబ్ ఇగర్ ఆ మేరకు స్పష్ఠంగా వివరాలు వెల్లడించారు.
ది వెర్జ్ మ్యాగజైన్ ఇటీవలి కథనం ప్రకారం.. డిస్నీ CEO ఈ ప్రకటన చేసారని .. ప్లాన్ చేసిన విధంగా ఆ పని ప్రారంభమవుతుందని పేర్కొన్నట్టు తెలిసింది. డిస్నీ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ని పోటీలో వెనక్కి నెట్టేందుకు ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కంపెనీ తన చెల్లింపు షేరింగ్ ప్లాన్‌ల గురించి వినియోగదారులకు తెలియజేయడం ప్రారంభించింది. పెయిడ్ షేరింగ్ ప్లాన్‌లకు ఎంత ఖర్చవుతుందనే దానిపై సమాచారం లేదు కానీ.. మునుముందు కొన్ని నెలల్లో మరిన్ని ప్రాంతాలకు వాటిని విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. నెట్ ఫ్లిక్స్ వరకూ అయితే... షేర్డ్ సబ్‌స్క్రిప్షన్ అదనపు సభ్యునికి నెలకు 7.99 డాలర్లు (సుమారు రూ. 670) బాదుతోంది. ఇదే విధంగా ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా వసూలు చేస్తుందన్నమాట.