సెన్సార్ కట్స్ లేకుండా ఓటీటీకి రూ.100 కోట్ల మూవీ
ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన 'మార్కో' సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.
By: Tupaki Desk | 4 Feb 2025 5:48 AM GMTఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన 'మార్కో' సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. పాతిక కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్ప అన్నట్లుగా విడుదలైన మార్కో సినిమా అంచనాలను మించి ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి చిత్ర యూనిట్ సభ్యులతో పాటు బాక్సాఫీస్ వర్గాలను సర్‌ప్రైజ్ చేసింది. ఈ మలయాళ సినిమాకు హనీఫ్ దర్శకత్వం వహించారు. మొదట కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేశారు. మలయాళ రిలీజ్ తర్వాత తెలుగులో వారం రోజులకే విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో మార్కోను తీసుకు వచ్చారు.
మలయాళ మార్కో సినిమా గత ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ అయిన దాదాపు ఎనిమిది వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది. అయినా అంచనాలు భారీగా ఉన్నాయి. థియేట్రికల్ వర్షన్ కాకుండా ఓటీటీ లో సెన్సార్ కట్స్ లేకుండా కొత్త వర్షన్‌ను స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేశారు అంటూ మలయాళ సినీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
మార్కో సినిమాలోని వయొలెంట్ కంటెంట్ సెన్సార్ కట్స్‌కి గురి అయ్యింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చి కూడా భారీ సెన్సార్ కట్స్ వేశారు. తీవ్రమైన రక్తపాతం సన్నివేశాలు వద్దని కట్స్ చెప్పారు. ఇప్పుడు ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసే సమయంలో సెన్సార్‌కి ఏ వర్షన్ అయితే పంపించారో దాన్నే కట్స్ లేకుండా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన సౌండ్ మిక్సింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే వర్క్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్కో సినిమాలో మామూలుగానే హింసాత్మక సన్నివేశాలు పీక్స్‌లో ఉన్నాయి. అలాంటి సన్నివేశాలు ఇప్పుడు మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి.
తెలుగులో భాగమతి సినిమాతో సుపరిచితుడు అయిన ఉన్ని ముకుందన్ ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో నటించడం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నా ఆ తర్వాత ఎక్కువగా టాలీవుడ్ సినిమాల్లో కనిపించలేదు. తెలుగు నుంచి పలు ఆఫర్లు వచ్చినా ఉన్ని ముకుందన్ ఆసక్తి చూపించలేదు. మలయాళంలో ఈయన మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు మార్కో సినిమాతో కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.