మూడో వారాల్లోనే రాకీ ఓటీటీ స్ట్రీమింగ్
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లాబొక్క పడటంతో ఒక వారం ముందుగానే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
By: Tupaki Desk | 13 Dec 2024 6:00 AM GMTఈ మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మినిమం నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. సూపర్ హిట్ అయిన సినిమాలను మాత్రం ఆరు వారాల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కానీ ఫ్లాప్ అయిన సినిమాలను మూడు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవల మెగా హీరో మూవీని కేవలం మూడు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లాబొక్క పడటంతో ఒక వారం ముందుగానే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఇప్పుడు మరో సినిమా సైలెంట్‌గా మూడు వారాలు పూర్తి కాకుండా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించిన మెకానిక్ రాకీ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి, కథలో ట్విస్ట్ ఉంది కానీ దాన్ని చూపించే తీరు బాగాలేదు. ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తీవ్ర నిరాశ మిగిలింది. పెద్దగా పోటీ లేకపోయినా వసూళ్ల విషయంలో మినిమం రాబట్టలేకపోయింది.
విశ్వక్‌సేన్ సినిమా ప్రమోషన్ సమయంలో చాలా అంచనాలు పెంచాడు. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒక సాధారణ సినిమా కాదు ఇది అనే ఫీల్ కలిగింది. కానీ సినిమాను చూసిన తర్వాత ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇదేం సినిమా బాబు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. రివ్యూవర్స్ కొందరు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చినా చివరకు సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సినిమా వసూళ్లు వారం రోజులు కూడా కంటిన్యూ కాలేదు. రెండో వారం నుంచి థియేటర్ల వద్ద సందడి లేదు. దాంతో మూడో వారంలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని కనీసం అధికారికంగా ప్రకటించలేదు. సినిమా స్ట్రీమింగ్ విషయంలో ముందస్తు ప్రచారం చేయలేదు. విశ్వక్ సేన్‌పై అభిమానంతో సినిమాను ఓటీటీలో చూడటం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా ద్వారా మెకానిక్ రాకీ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొన్ని వీడియోలను కట్ చేసి సోషల్ మీడియా ద్వారా వాటిని పంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.