ఓటీటీలపై మల్టీప్లెక్స్ యాజమాన్యం గుర్రు
ఓటీటీల రాకపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఆరంభం కొంత నెమ్మదిగా ఉన్న ఓటీటీలు కరోనా మహమ్మారీ రాకతో దూకుడు పెంచాయి.
By: Tupaki Desk | 13 March 2025 1:53 PM ISTఓటీటీల రాకపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. ఆరంభం కొంత నెమ్మదిగా ఉన్న ఓటీటీలు కరోనా మహమ్మారీ రాకతో దూకుడు పెంచాయి. ప్రజలకు థియేటర్ల కంటే బెస్ట్ ఆప్షన్ ఓటీటీ అని నిరూపిస్తున్నాయి. దీంతో థియేట్రికల్ గా రిలీజ్ చేసి సంపాదించాలనుకున్న చాలామందికి కంటికి కునుకుపట్టనివ్వని పరిస్థితి. అమీర్ ఖాన్ అంతటి వాడే ఇటీవల ఓటీటీలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్ వార్ లో ఎవరు ఎప్పుడు ఎలాంటి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీని పరిస్థితి. ఏదేమైనా ఓటీటీలు పరిశ్రమలపై గుత్తాధిపత్యం సాధిస్తున్నాయి.
ఇప్పుడు ఈ వార్‌లో ఇది ఇంకో లెవల్. ఇటీవల మాలీవుడ్‌లో విడుదలైన `ఆఫీసర్ ఆన్ డ్యూటీ` బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ వెర్షన్‌లు ఈ శుక్రవారం 14 మార్చి 2025న విడుదల కానున్నాయి. అయితే మల్టీప్లెక్స్‌లలో మినహా ప్రతిచోటా బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. మలయాళ వెర్షన్ 20 ఫిబ్రవరి 2025న విడుదలైంది. ఈ నెల చివర్లో పలు భాషలలో OTTలో విడుదల కానున్నందున, మల్టీప్లెక్స్ చైన్‌లు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి నిరాకరించాయి. దీని కారణంగా, వారు తమ థియేటర్లలో సినిమాను ప్రదర్శించడానికి ఇష్టపడటం లేదు. ఏదో ఒక రకంగా అడ్డంకులను సృష్టించారు.
అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి సమస్యను పరిష్కరించి విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. కుంచాకో బోబన్ ప్రధాన పత్రలో జితు అష్రఫ్ దర్శకత్వం వహించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు తెలుగు, తమిళ విడుదలలకు సిద్ధంగా ఉంది.