Begin typing your search above and press return to search.

సీజన్-3ల సందడి.. ఒకటి మంచి హిట్.. మరొకటి?

పంచాయత్ సీజన్ 3 అక్కడక్కడా స్లోగా అనిపించినా.. ఓవరాల్‍ గా మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆడియన్స్ ను అలరించింది.

By:  Tupaki Desk   |   1 Jun 2024 7:09 AM GMT
సీజన్-3ల సందడి.. ఒకటి మంచి హిట్.. మరొకటి?
X

కోవిడ్ ముందు వరకు ఒక లెక్క.. తర్వాత ఒక లెక్క.. అన్నట్లుగా ఉంది ఓటీటీల పరిస్థితి. పాండమిక్ టైమ్ లో సినీ ప్రియులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేశారు. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు డిమాండ్ భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లే ఆయా నిర్వాహకులు తమదైన ప్లాన్ తో అలరిస్తున్నారు. వరుస చిత్రాలను కొనుగోలు చేస్తూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకంగా తెరకెక్కించి కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఇక వెబ్ సిరీసుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ లు ఓటీటీ ఆడియన్స్ కు ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. భారీ వ్యూస్ సంపాదించుకున్నాయి. అదే స్థాయిలో క్రేజ్ కూడా దక్కించుకున్నాయి. దీంతో ఒక సీజన్ పూర్తయ్యాక మరో సీజన్ కోసం వెయిట్ చేస్తుంటారు ఓటీటీ లవర్స్. అలా ఇప్పటికే స్ట్రీమ్ అయిన కొన్ని వెబ్ సిరీసుల తర్వాత సీజన్లు కూడా సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఇదంతా పక్కన పెడితే.. స్ట్రీమింగ్ విషయంలో ఎప్పుడూ పోటీపడే ప్రముఖ ఓటీటీలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ ఇంట్రెస్టింగ్ స్టెప్స్ వేశాయి. ఇండియన్ ఓటీటీల్లో వచ్చిన అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటైన పంచాయత్ మూడో సీజన్ ను ఇటీవల అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేసింది. ఈ సీజన్ లో పంచాయతీ సెక్రటరీ అభిషేక్ త్రిపాఠితో పాటు అన్ని పాత్రలకు ప్రాధాన్యమివ్వగా.. మంచి టాక్ అందుకుంది. కామెడీ తగ్గినా.. ఎమోషన్లు మాత్రం మెప్పించాయి.

పంచాయత్ సీజన్ 3 అక్కడక్కడా స్లోగా అనిపించినా.. ఓవరాల్‍ గా మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఆడియన్స్ ను అలరించింది. అంతే కాకుండా.. మూడో సీజన్ చివర్లో నాలుగో సీజన్ కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అందులో పంచాయతీ ఎన్నికలే మెయిన్ గా ఉంటాయని కూడా చెప్పేశారు. దీంతో నాలుగో సీజన్ పై ఇప్పటి నుంచే మంచి హైప్ నెలకొంది. ఓటీటీ లవర్స్ కూడా ఫోర్త్ సీజన్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ సీజన్-3 స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. రాజస్థాన్ లోని కోటా కోచింగ్ సెంటర్ల విద్యార్థుల జీవితాల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు సూపర్ హిట్ అవ్వగా.. మూడో సీజన్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి పంచాయత్ సీజన్-3 మంచి రెస్పాన్స్ అందుకోగా.. కోటా ఫ్యాక్టరీ సీజన్-3 ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.