సలార్ రికార్డ్ బ్రేకింగ్.. 366 రోజులు ట్రెండింగ్
`సలార్- పార్ట్ 1` అద్భుతమైన విజయం తర్వాత `సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం` రాక కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Feb 2025 6:04 AM GMT`సలార్- పార్ట్ 1` అద్భుతమైన విజయం తర్వాత `సలార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వం` రాక కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో రెండవ భాగం 2026 లో వెండితెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ భారీ యాక్షన్ చిత్రం కోసం హోంబలే బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించనుందని టాక్ వినిపిస్తోంది. సలార్, కల్కి 2898 ఏడి సంచలన విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న ప్రభాస్ ప్రస్తుతం వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ రెండూ రిలీజయ్యే క్రమంలోనే అతడు సలార్ 2 పైనా ఫోకస్ చేయనున్నాడు.
ఇలాంటి సమయంలో సలార్ బృందానికి, ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. సలార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించడంలోనే కాదు, ఈ సినిమా అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత OTTలోను 366 రోజుల నిరంతరం ట్రెండింగ్ ద్వారా ప్రత్యేకమైన ముద్ర వేసింది. జియో హాట్‌స్టార్ లో సలార్: సీజ్ ఫైర్ ఆదరణకు ఫిదా అయిన ప్రభాస్ దీనిపై స్పంతిస్తూ.. ``త్వరలో ఖాన్సార్‌లో అడుగు పెట్టడానికి వేచి ఉండలేను`` అని ఆనందం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా పాలన... #సలార్ జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్‌లో ఉంది.. సంవత్సర కాలంగా ఆధిపత్యం చెలాయిస్తోంది అని హోంబలే సంస్థ సోషల్ మీడియాల్లో ఆనందం వ్యక్తం చేసింది. సలార్ హిందీ వెర్షన్ సైతం 3కోట్ల (30 మిలియన్ల) వీక్షణలతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం OTTలో టాప్ ట్రెండింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
రాజులు రాజ్యాలు అంతరించిపోయినా ఖాన్సార్ ప్రపంచంలో సరికొత్త రాజ్యాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్.. భారీ యాక్షన్ ని సృష్టించేందుకు ఎమోషన్స్ ని పెంచేందుకు అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియ రెడ్డి తదితరులు నటించారు.