పుష్ప-2.. అరెర్రే 'ఊపు' కాస్త 'ఉప్పు' అయిపోయిందే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2: ది రూల్ మూవీ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Feb 2025 3:43 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2: ది రూల్ మూవీ భారీ హిట్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు తిరగరాసి షేక్ చేసేసింది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఆ సినిమా.. పలు ఘనతలను కూడా సొంతం చేసుకుంది.
అయితే రీసెంట్ గా జనవరి 30వ తేదీన ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన పుష్ప-2 సినిమా అక్కడ కూడా సత్తా చాటుతోంది. వేరే లెవెల్ వ్యూస్ సంపాదించుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఇండియా ట్రెండింగ్ టాప్-1లో పుష్ప 2 అదరగొడుతోంది. గ్లోబల్ ట్రెండింగ్ టాప్-7లో ట్రెండ్ అవుతోంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప-2 అదనపు ఫుటేజ్ ఉన్న రీలోడెడ్ వెర్షన్ తో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో సోషల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ ఇస్తున్న సబ్ టైటిల్స్ కు సంబంధించిన మీమ్స్ కనిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే?
సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ రోల్ ను పోషించిన అల్లు అర్జున్.. ఏదో నములుతూ కనిపిస్తుంటారు. దీంతో కొన్ని డైలాగ్స్ క్లియర్ గా వినబడవు. కానీ కింద సబ్ టైటిల్స్ వస్తుండడంతో అందరికీ అర్థమవుతాయి. అవే కొన్నిసార్లు ఫన్నీగా మారి వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.
ఒక సీన్ లో పుష్ప రాజ్.. 'చెప్పిన డేట్ కే మీరు సీఎం అయితారు, లేడంటే ఈ పుష్ప ఊపు ఒడిలేసినట్టే..' అంటూ డైలాగ్ చెబుతారు. అయితే సబ్ టైటిల్స్ లో 'మీరు ఆ తేదీన సీఎం కాకపోతే, పుష్ప ఉప్పు తినడం మానేస్తాడు' అని ఇంగ్లీష్ లో వస్తుంది. దీంతో ఊపు కాస్త ఉప్పుగా మారిపోవడంతో ఆ స్క్రీన్ షాట్ ను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
సరదాగా మీమ్స్ కూడా కొందరు నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్.. సబ్ టైటిల్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. సబ్ టైటిల్స్ విషయం పక్కన పెడితే.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అని మూవీలో హీరో డైలాగ్ చెప్పినట్లు.. సినిమా గ్లోబల్ రేంజ్ లో ఓటీటీలో దుమ్మురేపుతోందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.