Begin typing your search above and press return to search.

థామస్ అద్భుతం చేసి చూపించాడు!

By:  Tupaki Desk   |   29 July 2015 6:14 AM GMT
థామస్ అద్భుతం చేసి చూపించాడు!
X
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు... కాదు కాదు థామస్ లు అవుతారు!! కాస్త అతిగా అనిపించినా ఈ విషయం తెలుసుకుంటే ఈ మాట అతిగా అనిపించకపోవచ్చు! అద్భుతాలు జరిగేముందు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరంలేదని త్రివిక్రం అన్నట్లు... ఏడోతరగతిలో చదువుమానేసిన, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి తనలోని ప్రతిభకు పదునుపెట్టాడు, మేదస్సుకు మెరుగులు దిద్దుకున్నాడు! దీంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు!

విషయంలోకి వస్తే... ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల సాజీ థామస్! ఇతనికి 12 - 13 ఏళ్ల వయసులో తన ఈడు పిల్లలంతా ఉత్సాహంగా ఆటలాడుకుంటుంటే ఇతడు మాత్రం పైనుండి ఎగురుకుంటూ వెళుతున్న విమానాలను, హెలీకాఫ్టర్లను అదేపనిగా చూస్తుండేవాడు! పరిస్థితుల దృష్ట్యా ఏడో తరగతితోనే తండ్రి చదువు మానిపించేసాడు! దీంతో పాడైపోయిన టీవీలు, టేపు రికార్డులు బాగు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉండేవాడు! అలా చిన్న షాపులో కూర్చుని పాడైపోయిన టీవీలు బాగుచేసుకుంటూ కూడా... ఏదోఒకరోజు ఏరోనాటికల్ ఇంజినీర్ అవ్వాలని, విమానాలు తయారుచేయాలని కలలు కనేవాడు! ఈ సమయంలో ఒకరోజు థామస్ కు ఒక పైలట్ పరిచయం అయ్యాడు! అతడి పరిచయమే థామస్ జీవితాన్ని మలుపుతిప్పింది!

ఈ పైలట్ సాయంతో ముంబై వెళ్లి అక్కడే రెండు మూడూ వారాలుండి... ఇతర పైలట్లు ఇచ్చిన పుస్తకాలు, చిన్న చిన్న సామాన్లు తీసుకుని తిరిగి సొంతూరికి వచ్చేశాడు థామస్! అనంతరం తన డ్రీం ప్రాజెక్టుకు మెల్లగా శ్రీకారం చుట్టాడు! తన కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో సెకండ్ హ్యాండ్ సామాన్లు చిన్న చిన్నవి, విమాన విడిభాగాలు కొని వాటితో ఒక విమానాన్నే తయారుచేశాడు! అనంతరం కేరళ లోని ఒక ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రదర్శనకు ఉంచాడు! ఈ రెండు సీట్ల విమానాన్ని తయారుచేయడానికి ఇతనికి రూ.14 లక్షలు ఖర్చయ్యింది! ఇదే సమయంలో ఇతని జీవిత కథ ఆధారంగా సినిమా తీయాలని భావిస్తున్నారు ప్రముఖ మళయాళ సినీ నిర్మాత సంతోష్!

మరో అతిముఖ్యమైన విషయం ఏంమిటంటే... ఇప్పటివరకూ మనం మాట్లాడుకున్న థామస్ మాట్లాడలేడు, ఇతరులు మాట్లాడింది వినలేడు! మూగ, చెవిటి!!