Begin typing your search above and press return to search.

ఫేస్‌బుక్‌ అధిపతిపై ప్రశ్నల వర్షం

By:  Tupaki Desk   |   2 July 2015 7:11 AM GMT
ఫేస్‌బుక్‌ అధిపతిపై ప్రశ్నల వర్షం
X
ప్రపంచ గతిని మార్చి.. ప్రపంచ జనులకు సరికొత్త వ్యవస్థ మీద మోజు పుట్టేలా.. విడిచిపెట్టలేనంత మమకారం కలిగేలా చేయటంలో సక్సెస్‌ అయిన వ్యక్తి ఫేస్‌బుక్‌ అధిపతి జుకర్‌బర్గ్‌. అలాంటి వ్యక్తి.. ఫేస్‌బుక్‌లో పరిమిత సమయం పాటు అందుబాటులో ఉంటానని.. ఎవరేం అడగాలని అనుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నింటిని తనను అడగాలని ఆయన కోరటం ఆలస్యం.. వేలాది మంది ఫేస్‌బుక్‌లో ఆయనకు ప్రశ్నలు సంధించారు.

ఒక అంచనా ప్రకారం కేవలం గంట వ్యవధిలోనే 42వేలకు పైగా ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. ఇక.. ప్రశ్నలు అడిగిన వారిలో సామాన్యులే కాదు.. అసమాన్యులు చాలామందే ఉన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మొదలు.. హాలీవుడ్‌ స్టార్‌.. రాజకీయ నేత అయినా ష్వార్జ్‌నెగ్గర్‌లాంటి ప్రముఖులు చాలామందే ఉన్నారు. మరి.. జుకర్‌బెర్ట్‌కు సంధించిన ప్రశ్నలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

''మనిషి ఎంత బిజీ అయిపోయారంటే.. కనీస వ్యాయామం కూడా చేయలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే మీ సంగతేంటి? మీరు వ్యాయామం విషయంలో తీసుకునే జాగ్రత్తలేంటి? భవిష్యత్తులో మనుషులపై యంత్రాలు పైచేయి సాధిస్తాయా?'' ష్వార్జ్‌నెగ్గర్‌ ప్రశ్నిస్తే.. దానికి ఫేస్‌బుక్‌ అధిపతి ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. ఎవరు ఏ పని చేసినా శక్తి కావాలని.. ఎనర్జీ లెవల్స్‌ చక్కగా ఉండాలంటే ఫిట్‌నెస్‌ ముఖ్యమని పేర్కొంటూ తాను వారంలో మూడుసార్లు ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు. అంతేకాదు.. తన పెంపుడుకుక్కతో నిత్యం జాగింగ్‌ చేస్తానని చెప్పిన ఆయన.. భవిష్యత్తులో యంత్రాలు ఎప్పుడూ మనుషుల మీద పైచేయి సాధించలేవని తేల్చేశారు.

ఇక.. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అయితే.. సైన్స్‌కు సంబంధించి ఏ ప్రశ్న అడగాలని భావిస్తున్నారని ప్రశ్నిస్తే.. దానికి ఆయనిచ్చిన సమాధానం ఏమిటంటే.. ప్రజలకు సంబంధించిన ప్రశ్నలంటే తనకిష్టమని.. వ్యాధుల్ని ఎలా నిర్మూలించాలి? మనుషులు మరింత బాగా పని చేయటానికి ఏం చేయాలన్న వాటిపై తాను ప్రశ్నలు వేస్తానని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ అధిపతికి చిలిపిగా కూడా ప్రశ్నలు సంధించిన వారు ఉన్నారు. అలాంటి ప్రశ్నల్లోకి వెళితే.. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఫేస్‌బుక్‌ అదృశ్యమైతే ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తే.. సింఫుల్‌గా.. మళ్లీ నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. మరి.. మీరు ఎడారి ప్రాంతంలో ఒంటరిగా వెళ్లాల్సి వస్తే.. మీతో పాటు ఉంచుకునే మూడు వస్తువులు ఏమిటంటే.. ఇంటర్నెట్‌ సౌకర్యం ప్రపంచంలో ప్రతిమూల వస్తున్న నేపథ్యంలో తన భార్య.. పెంపుడు కుక్క.. ఫోన్‌ అని చెప్పారు. ఒకవేళ ఇంటర్నెట్‌ లేని పక్షంలో ఫోన్‌కు బదులు పుస్తకమని బదులిచ్చారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జుకర్‌బెర్గ్‌ ఓపిగ్గా సమాధానాలు ఇవ్వటం గమనార్హం.