ఆ నియోజకవర్గం బీజేపీదేనట.. రాసిపెట్టుకోవాలంటున్న నేతలు.. ఎక్కడ..ఏమిటి?
గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి హరిష్ బాబు.. దూకుడుగా ఉన్నారు
By: Tupaki Desk | 27 July 2023 4:30 PM GMTతెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ నేతలకు, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు మధ్య కొన్ని కొన్నినియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా కొందరు బీజేపీ నాయకులు.. తాము గెలిచే నియోజకవర్గాల జాబితాను రెడీ చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న నియోజకవర్గం కొమ్రంభీం జిల్లాలోని సిర్పూర్. ఈ నియోజకవర్గంలో ఈ దఫా బీజేపీ గెలుపు ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.
2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కోనేరు కోనప్ప.. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకు న్నారు. 2014లోనూ ఈయనే ఇక్కడ విజయం దక్కించుకున్నారు. అయితే, అప్పట్లో బీఎస్పీ తరఫున పోటీ చేయడం గమనార్హం.
తర్వాత బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకుని 2018లో ఆ పార్టీ టికెట్‌పైనే పోటీకి దిగారు. అయితే, ఇక్కడ నుంచి ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి హరిష్ బాబు.. దూకుడుగా ఉన్నారు.
పల్లెపల్లెకు తిరుగుతున్నారు. సైలెంట్‌గా ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. బీజేపీ విధానాలను వివరిస్తున్నారు. అదేసమయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇక, ఎమ్మెల్యే కోనప్ప.. ప్రజలకు అందుబాటులో లేరని.. ఆయన కేవలం హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని విమర్శలు గుప్పిస్తు న్నారు. మొత్తంగా హరీష్ బాబు గత కొన్నాళ్లుగా ప్రజలతోనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ ఈ టికెట్‌ను గెలిచినంత సంతోషంగా ఉంది.
మరోవైపు.. కోనప్ప ఊసు పెద్దగా కనిపించడం లేదు. వరుస విజయాలు.. గత ఎన్నికల్లో 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లోనూ తన వర్గం తనకు అండగా ఉంటుందని చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం కోనప్పకు వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.
మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పరిణామాలు వస్తాయో చూడాలనికోనప్ప వర్గం చెబుతోంది. ప్రస్తుతం మాత్రం పాల్వాయిపై సింపతీ ఉండడం వాస్తవమేనని పరిశీలకులు చెబుతున్నారు.