బీజేపీ సీఎం అభ్యర్థి ఈటలనా? అరవింద్ చెప్పిందదేనా?
అరవింద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి
By: Tupaki Desk | 25 July 2023 9:14 AM GMTఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ఇటీవల హడావుడిగా అధ్యక్షుణ్ని మార్చేసింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన సారథ్యంలోనే పార్టీ తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోబోతుందని స్పష్టం చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరూ అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సొంత పార్టీలో సీనియర్ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలతో నిండిన తెలంగాణ బీజేపీలో ఆ పదవి కోసం పోటీ ఉంది. అయితే తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. సీఎం అభ్యర్థి ఈటల రాజేందర్ అనే సందేహం రాకమానదు.
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు, అరవింద్‌కు పొసగలేదు. వీళ్లిద్దరి మధ్య విభేధాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలో ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ భేధాలు ఏర్పాడ్డయని సమాచారం. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా రావడంతో అరవింద్ ఫుల్ జోష్‌లోకి వచ్చారని సమాచారం.
ఇప్పటికే కిషన్‌రెడ్డిని పొగడ్తలతో అరవింద్ ముంచెత్తారు. తాజాగా ఓ కార్యక్రమంలో అరవింద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఓ బీజేపీ నేత తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పారు. దీంతో వేదిక మీద ఉన్న ఒకరిని ఉద్దేశించే అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చలు జోరందుకున్నాయి.
ఈటల రాజేందర్‌నే బీజేపీ సీఎం అభ్యర్థిగా అరవింద్ పరోక్షంగా ప్రస్తావించారనే టాక్ మొదలైంది. కేంద్ర అధిష్ఠానం కూడా చాలా రోజుల నుంచి బలమైన బీసీ నేత కోసం చూస్తోంది. ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కోసం వెతుకుతోంది. ఈ లోపు ఈటలనే బీజేపీలోకి వచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయన గెలవడంతో రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ కనిపించింది.
ఇక ఇటీవల ఈటలను ఎన్నికల వ్యవహార కమిటీ ఛైర్మన్‌గా అధిష్ఠానం నియమించి.. ఆయనకు తగిన ప్రాధాన్యతనిచ్చింది. ఈ నేపథ్యంలో అరవింద్ వ్యాఖ్యల వెనుక ఈటలనే సీఎం అభ్యర్థి అనే అర్థం ఉందనే ఊహాగానాలకు తెరలేచింది. మరి పార్టీ అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.