Begin typing your search above and press return to search.

టఫ్ ఫైట్... అన్న ఇన్ బీఆరెస్స్ - చెల్లి ఇన్ కాంగ్రెస్!

ఈ సమయంలో నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు అన్నా చెళ్లెల్లు పోటీ పడబోతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   18 July 2023 8:41 AM GMT
టఫ్ ఫైట్... అన్న ఇన్  బీఆరెస్స్  - చెల్లి ఇన్  కాంగ్రెస్!
X

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తండ్రి ఒక పార్టీలో కుమారుడు మరోపార్టీలో ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అంటుంటారు పరిశీలకులు. ఇందులో భాగంగా... తెలంగాణలో అన్న బీఆరెస్స్ లో ఉంటే... చెల్లి కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం తెరపైకి వచ్చింది!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది. పైగా ఈసారి తెలంగాణలో బీఆరెస్స్ - కాంగ్రెస్ ల మధ్య రసవత్తర పోరు కన్ ఫాం అని అంటున్నారు. మరోపక్క బీజేపీని తక్కువ అంచానా వేయొద్దనేవారూ ఉన్నారు. ఈ సమయంలో నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు అన్నా చెళ్లెల్లు పోటీ పడబోతున్నారని తెలుస్తుంది.

అవును... నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆరెస్స్ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన వేముల ప్రశాంత్ రెడ్డి.. ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో ఆయన సోదరి వేముల రాధిక రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ మీద బాల్గొండ నుంచి పోటీచేయాలని ఫిక్సయినట్లు కథనాలొస్తున్నాయని అంటున్నారు.

దీంతో... ఈసారి బాల్గొండలో పరిస్థితి రసవత్తరంగా మారబోతోందని కొంతమంది అంటుంటే... మరికొంతమంది మాత్రం.. ఒకే నియోజకవర్గంలో అన్నా చెల్లెళ్ళు పోటీచేస్తే కుటుంబాల్లో గొడవలైపోతాయని అంతా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గం అదే కాకపోయినా... పక్క నియోజకవర్గం నుంచైనా ఆమె పోటీ మాత్రం పక్కా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాల్గొండ నియోజకవర్గంలోనే పోటీ చేయాలా.. లేక, నిజామాబాద్ జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచైనా పర్లేదా అనే విషయంలో ఆమె ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడారని తెలుస్తుంది. అయితే ఇంకా ఎక్కడినుంచి పోటీచేస్తారు అనే విషయంపై క్లారిటీ రానప్పటికీ... ఒకవేళ బాల్గొండ కాకపొతే మరో రెండు నియోజకవర్గాలను సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నారని తెలుస్తుంది.

అందులో భాగంగా... ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారని కథనాలొస్తున్నాయి. దీంతో... ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని అటు ప్రశాంత్ రెడ్డిని, అటు కేసీఆర్ సర్కార్ ని రేవంత్ & కో ఒక ఆటాడుకోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

అవును... రాధిక గనుక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే "మంత్రి సోదరే బీఆరెస్స్ ను కాదని కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్నారు" అనే విషయాన్ని హైలైట్ చేస్తూ... మంత్రిగా ప్రశాంత్ పని తీరు, సీఎం గా కేసీఆర్ పని తీరు ఇంట్లో వాళ్లకే నచ్చడం లేదనే స్థాయి కామెంట్లు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఏది ఏమైనా... ఈదఫా తెలంగాణలో ఎన్నికలు మాత్రం అత్యంత రసవత్తరంగా జరగబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

కాగా... ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల ఆందోళనల్లో రాధిక రెడ్డి చాలా యాక్టివ్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రత్యేక తెలంగాణా రాగానే ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అప్పట్లో ఊహాగాణలు వెలువడ్డాయి. అయితే ఆ విషయంపై ఆమె ఆసక్తి చూపించినట్లు ఎక్కడా విషయాలు వెలుగులోకి రాలేదు.

అయితే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్న ఆమె... 2023 ఎన్నికల్లో పోటీలోకి దిగాలని అనుకున్నారని తెలుస్తుంది. దీనికోసం ఆమె ఇప్పటికే వీఆరెస్స్ కు కూడా అప్లై చేసుకున్నారని సమాచారం.