Begin typing your search above and press return to search.

నల్లగొండ ఆలేరు మునుగోడు కామారెడ్డి పెద్దపల్లి.. కేసీఆర్ పోటీపై ఏమిటీ ఆట

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమైంది

By:  Tupaki Desk   |   22 July 2023 10:03 AM GMT
నల్లగొండ ఆలేరు మునుగోడు కామారెడ్డి పెద్దపల్లి.. కేసీఆర్ పోటీపై ఏమిటీ ఆట
X

ఒకటా రెండా..? ఆరు నియోజకవర్గాలు.. నాలుగైదు జిల్లాల పరిధి.. అన్నీ గతంలో టచ్ చేయనివే.. ఇదిగో ఇక్కడినుంచి పోటీ చేస్తారట.. అదిగో అక్కడి నుంచి బరిలో దిగుతారట.. ఇవీ తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీచేయడంపై వస్తున్న ఊహాగానాలు. వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ఇక్కడినుంచే పోటీచేస్తారని పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. రోజుకొకటి చొప్పున నియోజకవర్గం పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. నిన్నటివరకు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని వార్తలు రాగా.. ఇవాళ పెద్దపల్లి పేరు తెరపైకి వచ్చింది.

నాలుగు సార్లు ఎంపీగా..

ఇక్కడా అక్కడా అని లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలుస్తారని ఢంకా బజాయించి చెప్పొచ్చు. అందుకు గతంలోని ఉదాహరణలే నిదర్శనం. సిద్దిపేట సొంతగడ్డ అయిన కేసీఆర్.. 2004లో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలవడం ఓ రికార్డు. అందులోనూ 2006లో ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నికలోనూ విజయదుందుభి మోగించడం మరో రికార్డు.

ఆ వెంటనే 2009 లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి నెగ్గడం అంతకుమించిన రికార్డు. ఇక సొంత జిల్లా అయిన మెదక్ నుంచి 2014లో ఎంపీగానూ గెలుపొందడం ఆయన విశిష్టతను చాటుతోంది. అంటే .. కేసీఆర్ మూడు సందర్భాల్లో వేర్వేరే నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచారన్నమాట. ఉప ఎన్నికతో కూడా కలిపితే నాలుగు సార్లు ఎంపీగా గెలిచినట్లు.

అసెంబ్లీ ఆయన అడ్డా..

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో కేవలం 887 ఓట్లతో పరాజయం పాలైన ఆయన 1985 ఉప ఎన్నికల్లో ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పటినుంచి 2004 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆరుసార్లు అపజయమే ఎరుగలేదు. ఇందులో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ స్థాపించిన అనంతరం జరిగిన 2001 ఉప ఎన్నిక కూడా ఉంది. గజ్వేల్ నుంచి గెలుపొందిన రెండుసార్లను కూడా కలిపితే 8 సార్లు కేసీఆర్ అసెంబ్లీకి ఎన్నికయినట్లు అన్నమాట.

రెండుచోట్ల పోటీలో ముందంజ

కేసీఆర్ 2004లో తొలిసారిగా కరీంనగర్ లోక్ సభ, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందారు. ఆపై 2014 లో మెదక్ లోక్ సభ, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేశారు. అంటే రెండు వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఘనత కేసీఆర్ ది అన్నమాట.

అసెంబ్లీకి ఇన్ని నియోజకవర్గాల నుంచా..?

తెలంగాణలో హ్యాట్రిక్ విజయంతో అధికారం కైవసం చేసుకునే ప్రణాళికల్లో ఉంది బీఆర్ఎస్. ఈ క్రమంలో అధినేత కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గంపై ఊహాగానాలు వస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఇవి సాగుతున్నాయి. నల్లగొండ ఆలేరు మునుగోడు నుంచి కేసీఆర్ బరిలో దిగుతారని గతంలో ప్రచారం సాగింది. యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దినందుకు ఆలేరు నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని గతంలో సమర్థనలు వచ్చాయి. ఇక ఇప్పుడు కామారెడ్డి పెద్దపల్లి అని అంటున్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. కేసీఆర్ సర్వేల్లో ఈ విషయం తేలిందని చెబుతున్నారు. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా పెద్దపల్లిని ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ టీమ్ లు నియోజకవర్గంలో సర్వే చేస్తున్నాయని పేర్కొంటున్నారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి రెండుచోట్ల పోటీ చేస్తారని నిన్నటివరకు వార్తలు రాగా.. ఇప్పుడు గజ్వేల్ ను వీడి పెద్దపల్లినే ఎంచుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. దీనికితోడు బీఆర్ఎస్ కు ఆయువుపట్టయిన ఉత్తర తెలంగాణలో బలహీనంగా మారిన క్రమంలో అక్కడినుంచి ఏదో ఒక నియోజకవర్గంలో కేసీఆర్ బరిలో దిగుతారనే వాదన వినిపిస్తోంది.

మొత్తానికి కేసీఆర్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై భారీగా ఊహాగానాలు వస్తున్నా అధికారికంగా ఒక్కటీ నిర్ధారణ కాలేదు. అసలు పార్టీ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకే.. ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక తమ నియోజకవర్గం నుంచి కేసీఆర్ బరిలో దిగుతారని ప్రజలు చర్చించుకోవడానికి కేడర్ అప్రమత్తం కావడానికి కూడా ఇది ఉపయోగపడనుంది.