బెల్లంపల్లి బాద్ షాకు ఈ సారి షాకేనా?!
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దుర్గం చిన్నయ్య
By: Tupaki Desk | 27 July 2023 12:30 AM GMTఆయన బీఆర్ ఎస్‌లో కీలక నాయకుడు. బెల్లంపల్లి నుంచి వరుస విజయాలు దక్కించుకుని.. తన అభిమానులు, అనుచరులతో 'బాద్ షా'గా జేజేలు కొట్టించుకున్నారు. అయితే.. ఇది నిన్నటి గతం. ప్రస్తుతం ఆయనంటేనే ఏవగింపు. పైగా ఆయన పేరు ఎత్తేందుకు కూడా నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ఇష్టపడడం లేదనే సమాచారం వస్తోంది. దీంతో బెల్లంపల్లి బాద్‌షాకు ఈ సారి షాక్ తప్పదనే లెక్కలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే...
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దుర్గం చిన్నయ్య.. వరుస విజయాలు దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ, 2018 ముందస్తు ఎన్నికల్లోనూ ఆయన బీఆర్ ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
రెండు సార్లు కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన బెల్లంపల్లిలో చిన్నయ్య అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు కొన్నాళ్ల కిందటి వరకు వినిపించింది.
అయితే..ఎన్నికలకు మరో నాలుగు మాసాలే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? చిన్నయ్య దూకుడు ఎలా ఉంది? వంటి విషయాలను పరిశీలిస్తే.. మాత్రం ఆయన ఓటమి అంచుల్లో ఉన్నారని మెజారిటీ ప్రజల అభిప్రాయంగా ఉంది. ఇటీవల కాలంలో ఆయన వెల్లువెత్తిన వేధింపుల ఆరోపణలు... బెదిరింపులు.. సంపాదనపైనే దృష్టి పెట్టారన్న విమర్శలు వంటివి చిన్నయ్యన్న మరింత చిన్నబుచ్చుకునేలా చేశాయని అంటున్నారు.
ఇక, వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం కేసీఆర్.. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదని.. వారికి టికెట్ ఇచ్చి చేజేతులా వదులకునే పరిస్థితి లేదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన దరిమిలా.. చిన్నయ్యకు ఈ సారి టికెట్ దక్కే అవకాశం లేదని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ అభిమానం కొద్దీ ఆయనకు టికెట్ ఇచ్చినా.. ఓటమి ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి బాద్ షాకు ఈ సారి షాకేనని ప్రచారం జరుగుతుండడం గమనార్హం.