Begin typing your search above and press return to search.

గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై నుంచి క్రింద పడిన బైక్ !

హైదరాబాద్‌ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం

By:  Tupaki Desk   |   24 July 2023 7:42 AM GMT
గచ్చిబౌలి ఫ్లై ఓవర్  పై నుంచి క్రింద పడిన బైక్ !
X

హైదరాబాద్‌ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ ఫ్లైఓవర్ డివైడర్‌ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఆ ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు!

ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు స్పోర్ట్స్ బైక్‌ పై రాయదుర్గం నుంచి మాదాపూర్‌ వెళ్తున్న సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై డివైడర్‌ ను బలంగా ఢీకొట్టారు. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. క్షతగాత్రుడిని స్థానిక హాస్పిటల్‌ కి తరలించారు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధు (25)గా గుర్తించగా.. గాయపడిన వ్యక్తిని మచ్చగిరి (24) గా గుర్తించారు.

మెదక్‌ జిల్లా కకునూరుపల్లికి చెందిన బండి మధు(26), సూర్యాపేట జిల్లాకు చెందిన మచ్చగిరి (24) గచ్చిబౌలి ఆస్పత్రిలో ఎం.ఆర్.ఐ. టెక్నీషియన్లుగా పనిచేస్తూ మధురానగర్‌ లో నివాసం ఉంటున్నారట. వీరు బైకుపై ఆస్పత్రికి బయలుదేరిన సమయంలో... బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై షాగౌస్‌ హోటల్ సమీపంలో ఈ ప్రమాధం జరిగిందని తెలుస్తుంది.

ఈ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం తీవ్రతను పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారని అంటున్నారు. ఇక ప్రమాదం సమయంలో దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో బైక్ వెళుతుందని గుర్తించారని సమాచారం.

రాత్రి సమయంలో ఆ యువకులు మితిమీరిన వేగంతో వెళ్తూ డివైడర్ ను ఢీకొట్టడం వల్ల సుమారు వంద అడుగుల పైనుంచి కింద పడినట్లు సీసీ ఫుటేజీలను గమనిస్తే తెలుస్తుందని పోలీసులు అంటున్నారట. ఫ్లైఓవర్‌ పై అంత వేగంగా వెళ్లడానికి అనుమతి లేదని, వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.