నీట మునిగిన భాగ్యనగరం.. ఈ వార్త ఎక్కడిదాకా వెళ్లిందంటే!
వర్షం తగ్గిన తర్వాత కూడా
By: Tupaki Desk | 25 July 2023 4:04 AM GMTతెలంగాణ రాజధాని, భాగ్యనగరంగా పేరున్న హైదరాబాద్ నీట మునిగింది. కుండపోత వర్షంతో మంగళవా రం.. తడిసి ముద్దవడమే కాదు.. మోకాల్లోతు నీటిలో కూరుకుపోయింది. గంటల తరబడి కురిసిన వర్షంతో నగరం ఆమూలాగ్రం.. నీటిలో నానిపోయింది. ఎటు చూసినా.. నీరే.. ఎటు వెళ్లాలన్నా.. నీరే! పైగా.. ఎక్కడ నాలాలు నోళ్లు తెరుచుకుని ఉంటాయో తెలియని పరిస్థితి. అదేసమయంలో సరిగ్గా స్కూళ్లు వదిలే సమయం, ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి చేరుకునే సమయం. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు కాలం గడిపారు.
వర్షం తగ్గిన తర్వాత కూడా.. పరిస్థితి ఏమాత్రం సర్దు కోలేదు. ఇదిలావుంటే.. నీటమునిగిన భాగ్యనగరం.. అంటూ.. స్థానిక వార్తా చానెళ్లు ప్రసారం చేయడం సహజమే. ఇరు పొరుగు రాష్ట్రాల్లోని మీడియా చానెళ్లు కూడా ప్రసారం చేశాయి. దీనిని కూడా పెద్దగా లెక్కలోకి తీసుకునే పనిలేదు.
కానీ, బీబీసీ, రిపబ్లిక్ టీవీ వంటివి పెద్ద ఎత్తున ప్రసారం చేయడం.. ఉత్తరాది తర్వాత.. ఆ రేంజ్‌లో హైదరాబాద్ మునిగిపోయిందని గగ్గోలు పెట్టడం.. ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం వల్లే మోకాల్లోతు నీరు రోడ్లపై చేరిందని చెప్పడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరో నాలుగు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కీలకమైన రాజధాని నగరం నీట మునగ డం.. దీనిని పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు విస్తరించేలా వార్తలు ప్రసారం చేయడం వెనుక ఏదో వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇక, ఇదిలావుంటే, తెలంగాణలో రానున్న మూడు రోజులు కొన్ని చోట్ల.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మహబూ బాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జాబితాలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఉండడం గమనార్హం.