జీహెచ్ఎంసీకి షాక్.. నిజం.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇక మురుగు కాలువలు పొంగి పొర్లి ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి
By: Tupaki Desk | 26 July 2023 9:31 AM GMTతెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం అయితే.. వాన నీటి లో నానుతోంది. దీంతో ప్రజలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతలవారు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమను ఏదో ఒక రకంగా ఆదుకోవాలంటూ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే.. వారు కూడా వర్షాల దెబ్బతో ఎంత మందికని స్పందిస్తాం అనుకున్నారో.. ఏమో.. మౌనం పాటించారు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన హైదరాబాద్ వాసులు జీహెచ్ ఎంసీ అధికారులపై మండిపడ్డారు. గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తమకు కనీసం స్వాంతన కూడా ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం.. పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు నిజంగానే నానా తిప్పలు పడుతున్నారు.
ఇక మురుగు కాలువలు పొంగి పొర్లి ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. మురుగు నీరు ఇళ్లలోకి చేరడంతో పాటు మరోవైపు పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. జీహెచ్ఎంసీ అధికారులకు సంపత్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. అయితే ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకోలేదు.
అంతే ఆ యువకుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. పామును స్వయంగా తానే బంధించి తెచ్చి .. స్థానిక జీహెచ్ఎంసీ ఆఫీసులో వదిలాడు. ఆఫీసులోని టేబుల్‌పై పామును పెట్టి సంపత్ తన నిరసన వ్యక్తం చేశాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా హడలి పోయారు. యువడిపై నిప్పులు చెరిగారు. దీంతో ఆ యువకుడు కూడా.. ఎదురు దాడి చేశాడు. మీరే ఇంత హడలి పోతే.. మా పరిస్థితి ఏంటని నిలదీశాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. మున్ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో అని అధికారులుకూడా నివ్వెర పోతున్నారు.