గజ్వేల్+ కామారెడ్డి.. కేసీఆర్ మళ్లీ రెండుచోట్ల పోటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయమే వేరు
By: Tupaki Desk | 21 July 2023 11:34 AM GMTబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయమే వేరు. సాహాసోపేత నిర్ణయాలకు ఆయన పెట్టింది పేరు. అది 2001లో టీడీపీకి రాజీనామా చేయడం కానీ.. ఎవరూ ఊహించని స్థాయిలో తెలంగాణ కోసమంటూ టీఆర్ఎస్ ను స్థాపించడం కానీ.. కాంగ్రెస్ తో 2004లో పొత్తు పెట్టుకోవడం కానీ.. 2009లో టీడీపీ, వామపక్షాలతో మహా కూటమి కట్టడం కానీ.. ఏదైనా కేసీఆర్ కే సాధ్యం. 2009 తర్వాత పరిణామాలను తనకు అనుకూలంగా మార్చకున్న తీరు మహాద్భుతం. ఆ స్థాయి ఉద్యమం నిర్మించడం కేసీఆర్ కే సాధ్యం అనేలా జరిగింది తెలంగాణ ఉద్యమం. దీంతోనే తెలంగాణ సాకారమైంది.
ఉప ఎన్నికలకు వెరవకుండా..
టీఆర్ఎస్ అంటేనే ప్రత్యేక తెలంగాణ జెండా. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ ఉప ఎన్నికలను అస్త్రంగా ఎంచుకున్నారు. అసలు టీఆర్ఎస్ పుట్టిందే ఉప ఎన్నిక నుంచి కావడం విశేషం. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో కేసీఆర్ గెలుపే టీఆర్ఎస్ కు ఊపిరిలూదింది. ఇక 2006లో కేంద్ర మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, కరీంనగర్ ఎంపీ స్థానానికి రాజీనామా.. ఆపై తిరిగి ఉప ఎన్నికలో గెలుపు తెలంగాణ ఉద్యమానికి ప్రాణంపోశాయి. 2008, 2010లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దుతుగా రాజీనామాలు చేశారు.
రెండుచోట్ల పోటీ కేసీఆర్ మేటి
కేసీఆర్ పలు ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో సిద్దిపేట ఎమ్మెల్యే స్థానానికి, కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. రెండుచోట్లా విజయం సాధించారు. సిద్దిపేటను ఖాళీ చేయగా.. ఆయన మేనల్లుడు హరీశ్ రావు అక్కడినుంచి పోటీచేసి గెలిచారు. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి నెగ్గారు. ఒక్కచోటే బరిలో దిగిన ఆయన తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. ఇక తెలంగాణ సాకారమైన 2014లో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే, సొంతగడ్డ సిద్దిపేట కాకుండా గజ్వేల్ వంటి కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడినుంచి తొలిసారి నామమాత్ర ఆధిక్యం సాధించినా రెండోసారి రికార్డు మెజారిటీ కొట్టారు. 2014లో కేసీఆర్ మెదక్ లోక్ సభకూ పోటీ చేయడం గమనార్హం. సీఎం అయ్యాక మెదక్ ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు.
కామారెడ్డిపై కన్ను...
ఈసారి గజ్వేల్ నుంచే కాక కామారెడ్డి నుంచి కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని అంటున్నారు. అసలు ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారో స్పష్టంగా తెలియడం లేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. అయితే, గజ్వేల్ లోనూ ఆయన పోటీ చేస్తారని పేర్కొంటున్నారు. కానీ, కామారెడ్డి నుంచి పోటీయే కాస్త భిన్నం. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచింది.
ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గమే కామారెడ్డి. ఇప్పుడు జిల్లా కేంద్రంగానూ మారింది. 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు ఇక్కడ గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. 1994లో ఓసారి గెలిచారు. అలాంటి గోవర్ధన్ ను కాదని కేసీఆర్ బరిలో దిగుతుండడం విశేషమే. దీనిపై పూర్తి అధికారిక సమాచారం వస్తే కాని అసలు సంగతి తెలియదు.