బీజేపీకి ఖమ్మం అచ్చిరావటం లేదా ?
ఖమ్మం జిల్లాలో ఉనికి చాటుకోవాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది
By: Tupaki Desk | 29 July 2023 4:54 AM GMTఖమ్మం జిల్లాలో ఉనికి చాటుకోవాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను పిలిపించాలని ప్రయత్నాలు చేస్తోంది. అమిత్ షా తో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టాలన్నది బీజేపీ ప్లాన్ కానీ బీజేపీ ప్రయత్నాలకు కాలమే సహకరించటంలేదు. ఎందుకంటే ఈనెల 29వ తేదీన పెద్ద బహిరంగసభ ఏర్పాటు చేసినట్లు, దానికి అమిత్ షా పాల్గొంటున్నట్లు ప్రకటించిన రెండు రోజుల్లోనే రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
బహిరంగసభ రద్దుకు కారణం ఏమిటంటే భారీ వర్షాలే. ఇపుడే కాదు గతంలో కూడా రెండుసార్లు బహిరంగసభలు ఏర్పాటుచేసి వాతావరణం అనుకూలించక సభలను రద్దుచేశారు. మూడుసార్లు వరుసగా అమిత్ షా బహిరంగసభలే రద్దవుతున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏర్పాటుచేసుకున్న బహిరంగసభలు, కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. బీజేపీకి మాత్రం వాతావరణం అడ్డువస్తోందంటే పార్టీకి ఖమ్మం జిల్లా అచ్చిరాలేదనే సెటైర్లు ఎక్కువైపోతున్నాయి.
నిజానికి జిల్లాలో పార్టీ ఉనికి అంతంతమాత్రమే. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావటం ఖాయమనే ఊపు ఒకపుడు వచ్చేసింది. అదే పద్దతిలో ఖమ్మం జిల్లాలో కూడా కొందరు నేతలు కాస్త హడావుడి చేశారు. అయితే రాష్ట్రంలో చప్పబడిపోయినట్లే జిల్లాలో కూడా చప్పబడిపోయింది. జిల్లాలో అసలే పార్టీ ఉనికి అంతంతమాత్రం. ఇంతోటిదానికి చప్పబడిపోయిందంటే మళ్ళీ ఉత్సాహం వచ్చేదెలా ? అందుకనే అమిత్ షా ను పిలిపించాలని నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎందుకో వాతావరణమే సహకరించటంలేదు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు అంటే జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పోటీచేసేంత సీనున్న గట్టి నేతలు ఒక్కళ్ళు కూడా లేరు. జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా అంటేనే 50, 100 మందికన్నా కనబడరు. అలాంటిది ఇక ఎన్నికల్లో పోటీ అంటే చెప్పేదేముంది ? అందుకనే ఇతర ప్రార్టీల్లోని నేతల కోసం గేలమేసినా ఎవరు తగల్లేదు. చాలాకాలం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చాలా ఆశలే పెట్టుకున్నది పార్టీ. అయితే పొంగులేటేమో చివరలో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏం చేస్తాం కొన్నిసార్లు అలా జరుగుతుంటాయంతే.